sonia t.formation
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

National:మలిదశ ఉద్యమానికి ముగింపునిచ్చిన కాంగ్రెస్

  • వైభవోపేతంగా తెలంగాణ పదేళ్ల సంబురాలు
  • తొలి దశనుంచి మలిదశదాకా కాంగ్రెస్ కీలక పాత్ర
  • 2004లో వైఎస్ హయాంలోనే కీలక అడుగు
  • ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చిన కాంగ్రెస్
  • మలుపు తిప్పిన సోనియాగాంధీ రాయబారం
  • వ్యతిరేకించిన ఆంధ్రా కాంగ్రెస్ నేతలను ఒప్పించిన సోనియా
  • ఎట్టకేలకు సోనియా చొరవతో ఉభయసభలలో బిల్లుకు ఆమోదం
  • ఏపీలో అధికారం పోతుందని తెలిసినా ఉద్యమానికి విలువనిచ్చిన సోనియా

Telangana formation congress plays key role through sonia:
చుక్క రక్తపు బొట్టు నేలపై చిందకుండా సాకారమైన ఆశయం..చిన్నారులనుంచి పెద్దల వరకూ, స్కూలు విద్యార్థినుంచి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల వరకూ, కూలీ నుంచి ఉన్నతాధికారి వరకూ మహిళలనుంచి మహా రచయితలు, కవులు, కళాకారులు అంతా కలిసి ఏకతాటిపై నిలచి ఏకధాటిగా నడిపిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. చరిత్రలో మనకు తెలిసి అనేక ఉద్యమాలు జరిగాయి అవి యుద్ధాలుగా రూపాంతరం చెందాయి. ఆ యుద్ధాలతో కొన్ని రక్తపుటేరులు పొంగాయి. అయితే కేవలం శాంతియుత ఉద్యమం ద్వారా దశాబ్దాల కలను సాకారం చేసుకున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం మాత్రమే. అయితే తొలిదశ నుంచి మలి దశ దాకా సాగిన ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర మరపురానిది. ఉద్యమం పతాక దశకు చేరుకున్న క్షణంలో మంచి ముగింపు నిచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజానీకం ఎన్నటికీ తీర్చుకోలేని రుణమే. ఆ క్షణంలో తాను తీసుకున్న సంచలన నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలకూ దూరం అవుతామని తెలిసినా..అమరవీరుల త్యాగాలను పరిగణనలోకి తీసుకుని త్యాగానికి సిద్ధపడ్డ సోనియాగాంధీ అభినందనీయురాలు.


వైఎస్ హయాంలోనే కీలక పరిణామం

నాడు తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గద్దెదింపాలనుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలతో జట్టుకట్టారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక కీలక పరిణామం. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలోనూ యూపీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. 2004 జూన్ 7న రాష్ర్టపతి ప్రసంగంలోనూ తెలంగాణ ప్రతిధ్వనించింది. తెలంగాణపై విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2004 నవంబర్‌లో కేంద్రం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ, నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరో కీలక పరిణామంగా చెబుతారు. ఉద్యమం తీవ్రం కావడంతో తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి వైఎస్ ప్రభుత్వం 2008లో రోశయ్య కమిటీని నియమించింది.


2009లో ప్రత్యేక తెలంగాణ వాగ్దానం

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. 2009 సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఉద్యమం మరో మలుపు తిరిగింది. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 1990 నుంచి కాంగ్రెస్ తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకుంది. 1990 సంవత్సరంలో జానారెడ్డి కన్వీనర్ గా కాంగ్రెస్ తెలంగాణ ఫోరం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై నాటి దేశ ప్రధాని పీవీ నరసింహరావు కు వినతి పత్రాన్ని సమర్పించింది.

సోనియా గాంధీ పాత్ర

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జి.చిన్నారెడ్డి అధ్యక్షతన 2001లో తెలంగాణ ఫోరం ఏర్పడింది. అదే సంవత్సరం ఆగస్టు 11 న అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీకి వినతి పత్రం అందజేశారు చిన్నారెడ్డి. దీనికి స్పందించిన సోనియా గాంధీ నాటి కేంద్ర హోం మంత్రి బీజేపీకి చెందిన ఎల్ కే ఆద్వానీ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత 2014 సంవత్సరంలో తెలంగాణ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ సొంత పార్టీ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ వారితో మాట్లాడి ఎట్టకేలకు ఒప్పించి ఆ బిల్లుని ఆమోదింపజేసి అప్పటికి 58 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ కీలక పాత్ర వహించారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షతన ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వం తన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్)లో తెలంగాణ అంశాన్ని పొందుపరిచింది. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చడం జరిగింది.

పార్టీకి నష్టమని తెలిసినా..

2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద తెలిపింది. ఫిబ్రవరి 20న యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ రోజే బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ర్టపతి సంతకం చేశారు. మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకమైంది. ఏపీలో పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?