- తెలంగాణ అవతరణకు పూర్తయిన పదేళ్లు
- ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిన కేసీఆర్
- నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ నిండా ముంచిన నిర్లక్ష్యం
- రేవంత్ రెడ్డికి దొరికిన అరుదైన అవకాశం
- కేసీఆర్ వైఫల్యాలను విజయ సోఫానాలుగా మార్చుకునే అవకాశం
- లోక్ సభ ఫలితాల తర్వాత పాలనలో తనదైన మార్క్
- తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని రేవంత్ రెడ్డి
- అయినా ఉద్యమకారులతో సత్సంబంధాలు పెంచుకుంటున్న రేవంత్
Telangana formation after 10 years reventh get good opportunity to prove:
సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ సాధించుకున్న ఆనందం..దశాబ్దాల కలలు సాకారం అయిన దినం..పల్లెపల్లెనా తెలంగాణ రాష్ట్ర సాధన సంబురాలు..సోనియాగాంధీకి పాలాభిషేకాలు…అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ అంబరాన్నంటిన సంతోషంతో యావత్ తెలంగాణ రాష్ట్రం పులకింత చెందింది. చరిత్రను శాసించి, నియంతలను ధిక్కరించి ఉద్యమాన్ని తారాస్థాయిలో నడిపి నాటి పాలకులను తమ దారికి తెచ్చుకున్న స్వప్నసాధకుల సంబురం అది. తెలంగాణ ఎవరు తెచ్చారు..ఎవరు ఇచ్చారు అనేదానికన్నా సమష్టిగా సాధించుకున్నారంటే బాగుంటుంది. ఇది ఏ ఒక్కరి వల్లో దక్కిన విజయమో కాదు. గొప్ప గొప్ప మేధావులు, కవులు, ఉద్యమాలు నడిపిన ప్రొఫెసర్ల ప్రభావం కూడా ఉంది. ఆచార్య జయశంకర్, ప్రజాకవి కాళోజీ ఇంకా అనేక మంది జానపద కళారాధకుల అందెల సందడి ..గద్దర్ గళం నుండి జాలువారిన విప్లవ గీతాల ఒరవడి అన్నీ వెరసి తెలంగాణ సాధన రథాన్ని ముందుకు నడిపే చక్రాలయ్యాయి. మలి దశ ఉద్యమానికి మార్గం చూపినట్లయింది. రాజకీయ జేఏసీ సారధ్యంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు చేయిచేయి కలపడంతో ఉద్యమం తారాస్థాయికి చేరుకుని ఢిల్లీ పాలకులను ఒప్పించే దిశగా సాగింది.
ఖాళీ ఖజానాను అప్పగించి
అయితే ఉద్యమాన్ని అంతిమ దశలో చేసిన నిరాహారదీక్ష ద్వారా కేసీఆర్ సెంటిమెంట్ మంటలు రాజేశారు. దానిని రాజకీయ ఓటు అస్త్రంగా మలుచుకున్నారు. తెలంగాణ తొలి సీఎంగా తన అసలైన లక్ష్యాన్ని చేరుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ మన రాష్ట్రం మన నిధులు అంటూ పదేళ్లుగా తెలంగాణను పాలించినా..ధనిక రాష్ట్రంగా పైకి కాస్ట్ లీ కోటు కప్పి..లోపల మాత్రం చిరుగులను కవర్ చేశారు. తీరా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖాళీ అయిపోయిన ఖజానాను రేవంత్ రెడ్డికి అప్పగించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కలిసినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు ఒక మాట చెప్పారట. ‘‘కేసీఆర్ గారూ, మీకు చరిత్ర గొప్ప అవకాశం ఇచ్చింది. చాలా అపురూపమైన అవకాశం. సత్పరిపాలన అందించి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’’ అని. కేసీఆర్ ఆ సలహాకు తగ్గట్టు నిలబడలేకపోయారని హరగోపాల్ బాధపడుతూ ఉంటారు. కేసీఆర్ వైఫల్యం ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాగలగడానికి ఒక ముఖ్యమైన కారణం. కానీ, అదే ఏకైక కారణం కాదు. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్‌పై పెరిగిన విముఖతను, ప్రత్యామ్నాయానికి ఉన్న అవకాశాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి తనను తాను సన్నద్ధం చేసుకోగలిగారు.
ఇంతింతై..రేవంతుడై
తనకు ఎదురెవ్వరూ లేని వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించుకుని, అదే తనకు భద్రత అనుకున్నారు. కానీ, అదే ఒక భర్తీ చేయవలసిన శూన్యాన్ని కూడా సృష్టించింది. కేసీఆర్ పాలనమీద ఆయనకు దీటైన రీతిలో దూకుడుగా, ఒక్కొక్కసారి మొరటుగా కూడా మాట్లాడడమే ఫలితం ఇస్తుందని భావించి రేవంత్ అందుకు తగ్గట్టు తన ప్రయాణం సాగించారు. టీడీపీని వీడి, కాంగ్రెస్‌లోకి వచ్చిన కొంతకాలానికే పీసీసీ అధ్యక్ష స్థానం లభించిందంటే అందుకు అధిష్ఠానం ఆశీస్సులు కారణం. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందడం, వయోధికుడు కాకపోవడం ఆయనకు అదనపు యోగ్యతలయ్యాయి. బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు, తెలంగాణ ఉద్యమంతో పరిమితమైన అనుబంధమే ఉన్నప్పటికీ, దాన్ని ఎట్లా అధిగమించాలో ఆయనకు కొన్ని సొంత ఆలోచనలు ఉన్నాయి. గద్దర్‌తో నాడు మెలగిన, కోదండరామ్‌తో నేడు మెలగుతున్న తీరు తన నాయకత్వంలోని పాలనకు ఉద్యమస్ఫూర్తి జోడించగలవని రేవంత్ నమ్ముతున్నారు. కేసీఆర్ పాలనలో లోపించిన ముఖ్యమైన దినుసు ఏదో గ్రహించబట్టే, ఆయన పార్టీ ఇచ్చిన ఆరుగ్యారంటీలకు తోడు ఏడోదిగా ప్రజాస్వామ్యాన్ని హామీ ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేరుతుందన్నది తెలంగాణ పౌరసమాజం గమనిస్తూ ఉన్నది. అలాగే, తాజాగా, రాష్ట్రగీతం, రాష్ట్ర చిహ్నాల విషయంలో ఏర్పడిన వివాదం ఉద్యమ విలువలకు సంబంధించిన చర్చను రేవంత్ పాలనలో మొదటిసారిగా ముందుకు తెచ్చింది.
రేవంత్ కు ఇదో అరుదైన అవకాశం
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చవలసిన కర్తవ్యంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సరైన న్యాయం చేయలేకపోయారని ఆయనను సీఎం సీటునుంచి దించేశారు. అదే సమయంలో చుక్కానిలా కనిపించిన రేవంత్ రెడ్డి పై ఇప్పడు చాలా బాధ్యతలే ఉన్నాయి. కేసీఆర్ ఎక్కడైతే విఫలమయ్యారో ఆ వైఫల్యాలనే మెట్లుగా మలుచుకునే యత్నాలు మొదలుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ స్థిరత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, రేవంత్ మీద కేంద్రం నుంచి, కేంద్ర ఏజెన్సీల నుంచి రకరకాల ఒత్తిళ్లు మొదలవుతాయి. గోడదాటుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ శాసనసభ్యులు, తమ గమ్యాన్ని కాంగ్రెస్ వైపు కాక, బీజేపీ వైపు మార్చుకుంటారు. ఒకవేళ మోదీయేతర ప్రభుత్వం వస్తే కొంత ఊరట ఉంటుంది. ఇవన్నీ కాక, కాంగ్రెస్‌లో సహజమైన ఇంటిపోరు ఉండనే ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ, తెలంగాణ సమాజానికి నెరవేర్చవలసిన బాధ్యతల విషయంలో ఏ మాత్రం అలసత్వం చూపకూడదు. రేవంత్ కు దక్కిన ముఖ్యమంత్రి పదవి ఓ చారిత్రక అవకాశం. అటు ఉద్యమ ఆశయాలను నెరవేరుస్తూ ఇటు పాలనలో స్వచ్ఛత ప్రదర్శిస్తూ..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగాలని ఆశిద్దాం. గత పదేళ్లుగా కేసీఆర్ చేయలేని అసాధ్యాలను సుసాధ్యం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేయాలని కోరుకుందాం.