Anganwadi centres: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎస్ తో ప్రభుత్వానికి అందజేశారు. సొంత భవనాల్లో నడుస్తున్న 440 అంగన్వాడీ కేంద్రాలు, రెంట్ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు కలిపి మొత్తం 580 భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పైకప్పుల లీకేజీలు, గోడలు మరియు బేస్‌మెంట్‌లో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 75 అంగన్ వాడీ భవనాలు, నిర్మల్ లో 100, కామారెడ్డిలో49, గద్వాల్ లో 40, హనుమకొండలో 25, మెదక్ లో 25, వనపర్తి లో 22, ఆసిఫాబాద్ లో 20, ములుగు జిల్లాలో 20 అంగన్ వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. సొంత భవనాల మరమ్మతులకు రూ. 14కోట్లు, రెంట్ ఫ్రీ భవనాల మరమ్మతులకు రూ. 3కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలకు చేరడంతో బియ్యం, పప్పులు, పాల డబ్బులు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలు తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తడిసిపోయిన సరుకుల బదులుగా వెంటనే కొత్త సరుకులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్య ఒక్కరోజు కూడా అంతరాయం లేకుండా కొనసాగాలని సూచించారు. సురక్షిత భవనాల్లో అంగన్వాడి అంగన్వాడి సేవలు నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.