Janahita Padayatra: భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ఇల్లంద నుంచి వర్ధన్నపేట వరకు 5 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర
వరంగల్, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాహిత పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రజాహిత పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లంద వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలకు వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇల్లంద వద్ద ప్రారంభం అయిన పాదయాత్ర 5 కిలోమీటర్ల దూరం కొనసాగింది.
ఒకరు తెలంగాణను దోచుకున్న దొంగలు అయితే మరొకరు దొంగ ఓట్లతో గెలిచిన దొంగలు అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దొంగ ఓట్లతో గెలిచి దేశాన్ని దోచుకుంటున్నారని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు బీఆర్ఎస్, బీజేపీపై ఆయన మండిపడ్డారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో జరిగిన కార్నర్ మీటింగులో ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో మాకు ప్రతి పక్షం లేదన్నారు. కవిత – కేటీఆర్ పంచాయతీ తెగే సరికి పదేళ్లు పడుతుంది. పదేళ్లు మోసం చేసిన కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కూర్చున్నారు. దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీంకోర్టుకు వెళ్లాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయినట్టే. వాళ్లు రాజకీయంగా ఉండరు కాక ఉండరన్నారు. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి వత్తాసు పలుకుతోంది. నిన్న నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా’’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో గెలిచిన 8 మంది బీజెపీ ఎంపీల గెలుపు పట్ల అనుమానం ఉందని పునరుద్ఘాటించారు. ఓట్ల దొంగిలింపు జరిగిందని మరోసారి ఆరోపించారు. మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్‌లో కూడా వేశారన్నారు. 8 మంది బీజెపీ ఎంపీల గెలుపు అనుమానాస్పద ఎన్నిక అన్నారు. కిషన్ రెడ్డి మీకు బీసీల మీద ఇంత అక్కసు ఉందా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి భయపడి బీజేపీలోని బీసీ నేతలు నోరు విప్పడం లేదన్నారు. బండి సంజయ్ పుట్టుక బీసీ కావచ్చు.. కానీ బీసీ రిజర్వేషన్లకు అర్హుడు కాదన్నారు. రేవంత్ రెడ్డిని బీసీగా పరిగణించాలన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రజల కోసం కష్టపడే నాయకులు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ అని కొనియాడారు. ‘‘రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చేందుకు మీనాక్షి నటరాజన్ పనిచేస్తున్నారు. గతంలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అధికారంలో ఉన్న వాళ్లు ఎప్పుడూ పాదయాత్రలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనహిత పాదయాత్ర చేస్తున్నాం. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందాలంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. తెలంగాణలో కూడా ఓట్ల చోరీ చేసి బీజేపీ 8 సీట్లు గెలిచింది. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులదే’’ అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.