Shankar Nayak: కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ నేత శంకర్ నాయక్ నినాదాలు
మహబూబాబాద్, స్వేచ్ఛ: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ప్రభుత్వ చర్యల్లో తప్పులుంటే వాటిని ప్రశ్నించడం, నిరసన వ్యక్తం చేయడం చేయవచ్చు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు కూడా. తద్వారా ప్రభుత్వం కూడా తన తప్పులను గమనించి సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ప్రతి విషయాన్నీ, అసందర్భంగా రాజకీయం చేయాలనుకుంటే జనాలు ముక్కున వేలు వేసుకోవాలి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది.
మాజీ ఎమ్మెల్యే నినాదాలు..
యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వం అవరోధాలను అధిగమించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలు పంపిణీ చేస్తోంది. అయితే, విపక్షాలు మాత్రం యూరియా అంశాన్ని కేవలం రాజకీయం కోణంలోనే చూస్తున్నాయి. ఇందుకు నిలువెత్తు అద్దం పట్టే లాంటి ఘటన సోమవారం మహబూబాబాద్‌లో జరిగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (Shankar Nayak) అక్కడికి చేరుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
Read Also- CM Revanth Reddy: ఏం కావాలో రాసి పెట్టుకోండి.. మీ వద్దకే వచ్చి జీవోలు ఇస్తా.. సీఎం బంపరాఫర్!
సజావుగా యూరియా పంపిణీ చేస్తున్న సమయంలో విడ్డూరంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏఎస్ఎస్ కార్యాలయం వద్ద అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో రైతులకు యూరియాను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ నుంచి మహబూబాబాద్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులతో పీఏఎస్ఎస్ కార్యాలయం వద్ద వినూత్న పద్ధతిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను పంపిణీ చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటుతున్నప్పటికీ రైతులకు సరైన సాగునీటి అందుబాటు లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also- Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..
1,206 టన్నుల యూరియా పంపిణీ
ఈ వర్షాకాలం పంట కాలానికి రైతులకు ఇప్పటివరకు 1,206 టన్నుల యూరియాను పంపిణీ చేసినట్టు వ్యవసాయ మండల అధికారి తిరుపతిరెడ్డి వెల్లడించారు. రైతులకు ఇబ్బందులకు కలగకుండా యూరియాను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఒక్కో రైతు తమ కుటుంబంలోని నలుగురు వ్యక్తులతో కలిసి వచ్చి నాలుగు యూరియా బస్తాలను తీసుకెళ్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నుంచి యూరియా సజావుగా అందుతోందని, రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా యూరియాను పంపిణీ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని తిరుపతిరెడ్డి వెల్లడించారు.