Ganesh Chaturthi: మట్టి విగ్రహాలనే వాడండి
విజ్ఞానమే మార్గం – ప్రకృతే ప్రాణం!
మట్టి విగ్రహాలు – మట్టి మనిషికి భద్రత!
జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాస్ సూచన
మహబూబాబాద్, స్వేచ్ఛ: వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను వాడాలని మహబూబాబాద్ జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కే.శ్రీనివాస్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్ ప్రచార దృక్పథంతో సామాజిక చైతన్య వ్యాసం స్వేచ్ఛలో…
పరిచయం
వినాయక చవితి మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా పలు చోట్ల విస్తృతంగా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ఒక సంప్రదాయం. కానీ, పండుగను జరుపుకునే ఈ సాంప్రదాయంలో ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ దిశగా శాస్త్రీయ అవగాహనతో కూడిన మార్పులు అవసరమని జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా కమిటీ భావిస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో పర్యావరణానికి మేలు చేసే మార్గాలు ఏమిటంటే..
1.పీఓపీ నష్టాలపై శాస్త్రీయ వివరణ
పీవోపీ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఇది కాల్షియం సల్ఫేట్ మరియు హెమీహైడ్రేట్ మిశ్రమం. దీనికి నీటిలో కరిగే గుణం తక్కువగా ఉంటుంది. విగ్రహాల నిమజ్జనం వల్ల ఇది నదుల్లో లేదా చెరువుల్లోని నీటిలో సులభంగా కరగదు.
రసాయనాల ముప్పు
వినాయకుడి విగ్రహాలపై పూతగా వేసే రంగుల్లో సీసం, క్రోమియం, కాడ్మియం, మెర్క్యూరీ వంటి విషపూరిత లోహాలు ఉంటాయి. ఇవి నీటిలో చేరి మనుషులతో పాటు జలచరాల జీవాన్ని నాశనం చేస్తాయి.
ఆక్సిజన్ స్థాయి తగ్గడం
నీటిలో కరగని పదార్థాలు చేరడంతో ఆక్సిజన్ మార్పిడి తక్కువ అవుతుంది. దీని వల్ల చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి.
2.మట్టి విగ్రహాల శాస్త్రీయ ప్రాధాన్యం
ప్రకృతిసిద్ధమైన మట్టితో చేసినవి అయితే జీవావరణానికి హానికరం కాదు. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి. కాబట్టి, ఏ ముప్పూ ఉండదు.
పునరుపయోగం సాధ్యం
మట్టి విగ్రహాలను ఇంట్లో చిన్న నీటి గుంటలో నిమజ్జనం చేసి, ఆ నీటిని తోటల పంటలకు వాడవచ్చు.
జలవనరుల రక్షణ
నీటిలో విషపదార్థాలు చేరకుండా ఉండటం వలన భవిష్యత్ తాగునీటి సమస్యలు నివారించవచ్చు.
3.శాస్త్రీయ పద్ధతుల్లో జరుపుకునే వినాయక చవితి
సహజ రంగుల వినియోగించడం మంచిది. ఎందుకంటే, ప్రకృతి సిద్ధంగా లభించే రంగులు వాడటం ద్వారా నీటిలో హానికర రసాయనాల ముప్పును తగ్గించవచ్చు.
నిమజ్జన ట్యాంకుల ఏర్పాటు
కమ్యూనిటీ పరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక నీటి ట్యాంకుల్లో విగ్రహ నిమజ్జనం చేయడం ద్వారా చెరువులు, నదులు కలుషితం కాకుండా కాపాడవచ్చు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
విత్తన గణేశ్ విగ్రహాలు
విగ్రహాల తయారీకి విత్తనాలు ఉపయోగించడం వలన విగ్రహ నిమజ్జనం అనంతరం అవి మొక్కలుగా ఎదుగుతాయి. ఇది ప్రకృతికి మనం తిరిగి ఇచ్చే చిన్న కానుకగా మారుతుంది. ఔను కదా!
సామాజిక చైతన్యం లక్ష్యంగా:
పాఠశాలలు, కళాశాలలు వినూత్న సైన్స్ ప్రదర్శనల (science exhibitions) ద్వారా విద్యార్థుల్లో సైన్స్ ఆధారిత అవగాహన పెంచాలి. గ్రామాలలో సైన్స్ ప్రదర్శనలు, స్థానిక కళారూపాలు (పద్యం, పాట, బుర్రకథ) ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. సోషల్ మీడియా, రేడియో, టీవీ ఛానళ్ల ద్వారా వాస్తవ ఆధారాలతో కూడిన సమాచార ప్రచారం చేయాలి.
ఉపసంహారం
పండుగలు సంస్కృతికి, సంప్రదాయానికి గుర్తు. కానీ, పరిసరాలను సంరక్షించడమూ మన బాధ్యతే. ఈ వినాయక చవితి మనమందరం శాస్త్రీయంగా ఆలోచించి, సహజ పరిసరాలను కాపాడే మార్గాన్ని ఎంచుకుందాం.
