Urea shortage: దౌల్తాబాద్ మండలంలో యూరియా కొరత రైతన్నలను వేధిస్తోంది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడుతుండడంతో మండల కేంద్రంలోని జ్యోతి ట్రేడర్స్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు మాత్రం ఎమ్మార్పీకే యూరియా అమ్మకాలు జరపాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభమై చాలా వరకు పంటలు సాగులో ఉండడంతో రైతులకు యూరియా ఎక్కువగా అవసరం కావాల్సి వచ్చింది.
యూరియాకు డిమాండ్ ఏర్పడింది దీంతో బస్తా రూ.266.50 లకు అమ్మాల్సి ఉండగా రూ.350 డిమాండ్ చేస్తున్నారు. పంటలు దక్కించుకోవాలంటే యూరియా అవసరమని, అందుకోసం ఎరువుల దుకాణాలకు వెళితే అధిక ధరలు డమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎరవుల దుకాణ యజమానులు మాత్రం తమకు కంపెనీ వారు ఎరువులతో పాటు గుళికలు కూడా అంటగడుతున్నారని గుళికలు తీసుకుంటేనే మిగిలిన యూరియా సరఫరా చేస్తామని దుకాణ యజమానులు అల్టిమేటం జారీ చేయడంతో తప్పనిసరి స్థితిలో యరియాతో పాటు గుళికలు కూడా కొనుగోలుచేయల్సి వస్తుందన్నారు. ఎమ్మార్పీకే యూరియా అమ్మకాలు జరిగితే తాము నష్టాల బారిన పడాల్సి వస్తుందని ఇలాగైతే వ్యాపారాలు మానుకోవాల్సి వస్తుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. మండలంలోని కొన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రైతులు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తాం..
యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న విషయాన్ని మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ దృష్టికి తీసుకెళ్లగా రైతులు స్వయంగా వచ్చి తమకు ఫిర్యాదు చేస్తేనే తాము స్పందిస్తామన్నారు. రైతులు ఫిర్యాదు చేయకపోతే డీలర్లు ఎంతకు విక్రయించినా తమకు సంబంధం లేదని తెలిపారు.