Kondal Rao:
ఓ కార్పొరేటర్ కూడా పట్టుబడ్డ వైనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కూకట్‌పల్లి వైష్ణవి కాలనీలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌లో కొందరు పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌వోటీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు (Kondal Rao) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దొరికారు. తులసీ రావు నాయినేని, బాలరావు గన్నమనేని, అనిల్ కుమార్ చింతపట్ల, భాస్కర్ రావు, శ్రీనివాస్ రావు తీగల, భాస్కర్, కల్వకుంట్ల రంగారావు, అవధూత నాగేశ్వర్ రావు, మురళీ మోహన్ కృష్ణ కుమార్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2.52 లక్షల నగదు, రూ.1.10 లక్షల విలువ చేసే 11 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మొత్తం పదిమంది పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు.
Read Also- King Nagarjuna: తనతో సినిమా చేయమని దర్శకుడి వెంట పడ్డ కింగ్..? ఆ తోపు దర్శకుడు ఎవరంటే?
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో జరిగిన చోరీ కేసును చిక్కడపల్లి పోలీసులు 48 గంటల్లో చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 25 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వివేక్ నగర్ నివాసి నారాయణ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొందారు. 3 రోజుల క్రితం ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. 36 తులాల నగలు, కొంత నగదును దొంగిలించి ఉడాయించారు. ఈ ఘటనపై బాధిత వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన బ్రూస్ లీ, ఖమ్మం నివాసి సాయికుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 25 తులాల నగలు, రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్రూస్ లీపై 64 కేసులు, సాయికుమార్‌పై 57 కేసులు నమోదై ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Read Also- CP Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
నిత్య పెళ్లికొడుకుపై కేసులు
ప్రేమ పేరుతో యువతులను వలలో వేసుకొని వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న ఛీటర్‌పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. మోసగాడి చేతిలో వంచనకు గురైన మూడో భార్య ఫిర్యాదు చేయడంతో అతడి వ్యవహారం బయటపడింది. నిందితుడు రవికుమార్ అలియాస్ రఫీ అనే వ్యక్తికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ విషయాన్ని దాచి పెట్టి సిక్ చావానీ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మరికొందరు యువతులతో ప్రేమాయణాన్ని కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న మూడో భార్య నిలదీయగా, దారుణంగా కొట్టి తనకు అడ్డు వస్తే చంపేస్తానని బెదిరించాడు. దాంతో, బాధితురాలు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన స్వార్థం కోసమే రవికుమార్ మతం మార్చుకుని రఫీగా పేరు మార్చుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.