King Nagarjuna: విభిన్నచిత్రాలకు పెట్టింది పేరు కింగ్ నాగార్జున (King Nagarjuna). ‘శివ, మజ్ను, గీతాంజలి, అన్నమయ్య, షిరిడీ సాయి, ఓం నమో వెంకటేశాయ, మన్మథుడు, రాజన్న, ఢమరుకం’ వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు నాగ్ కెరీల్‌లో ఉన్నాయి. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, అడుగు పెట్టే ముందే నాన్న హెచ్చరికని ఎప్పుడూ గుర్తు పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు చేశానని తాజాగా కింగ్ నాగార్జున చెప్పుకొచ్చారు. తన సినీ కెరీర్ స్టార్టింగ్‌లో మొదటి ఐదారు సినిమాలు ఏదో చేశానంటే చేశాను తప్పితే.. అందులో లీనమై మాత్రం చేయలేదని చెప్పారు. తాజాగా కింగ్ నాగార్జున తన సినీ కెరీర్‌లోని ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
జీ5 ఓటీటీలో సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammu Raa) మొదలైన విషయం తెలిసిందే. విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ఈ షో.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా మొదలైంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌కు కింగ్ నాగార్జున గెస్ట్‌గా వచ్చారు. సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి? అని జగపతిబాబు అడిగిన ప్రశ్నకు కింగ్ నాగ్ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ‘‘నాన్న వెంట షూటింగ్స్‌కు వెళ్లేవాడిని. నాన్నను చూసి నేను కూడా నటుడిగా మారాలని అనుకున్నాను. ఇదే విషయం నాన్నకు చెబితే.. ఆయన కళ్లలో నీళ్లు వచ్చేశాయి. తన కొడుకు తన లెగసీని కంటిన్యూ చేస్తాడని ఆయన నమ్మారు. అందుకే, సంతోషంతో ఆయన అలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరోజే నాకు హెచ్చరిక చేశారు.
Also Read- Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?
ఇండస్ట్రీలోకి వచ్చానంటే వచ్చాను కాదు.. ఇక్కడ చాలా కష్టపడాలి. ఏఎన్ఆర్ సన్ ఎలా ఉంటాడో అని ఒకటి రెండు సినిమాలకు ప్రేక్షకులు వస్తారు. ఆ తర్వాత వాళ్లను రప్పించేది నీ కష్టమే. నువ్వు ఎంత కష్టపడితే.. అంత స్థానం వారి మనస్సుల్లో నీకు దక్కుతుంది అని చెప్పారు. ఈ మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకో.. అని నాన్న హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే మొదటి సినిమా ‘విక్రమ్’ అన్ని ఎలిమెంట్స్‌తో వచ్చి బాగానే ఆడింది. ఏఎన్ఆర్ సన్ అనే అంతా ఆ సినిమా చూడటానికి వచ్చారు. ఆ తర్వాత ఐదారు సినిమాలు చేశాను. దాసరి నారాయణరావుతో ‘మజ్ను’ చేశాను. కానీ నేను శాటిస్‌ఫై కాలేకపోతున్నాను. ఏదో చేశానంటే చేశాను అన్నట్లుగా నడిచివెళ్లిపోతుంది. అశ్వనీదత్ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ కమర్షియల్‌గా హిట్ అయినా, అది శ్రీదేవి, రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాతే నాకు అగ్నిపరీక్ష మొదలైంది.
Also Read- Rashmika – Vijay: ‘గీత గోవిందం’.. వైరల్ అవుతున్న విజయ్, రష్మికల లిప్ లాక్ వీడియో
ఆ రొటీన్ సినిమాలు చేయలేక బోర్ కొట్టేసింది. అప్పుడే మణిరత్నం (Mani Ratnam) ‘మౌనపోరాటం’ సినిమా చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఆయన వెంట పడ్డా. రోజూ మార్నింగ్ ఆయన వాకింగ్‌కు వెళ్లే సమయానికి ఆయన ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే వాడిని. నాతో ఒక సినిమా చేయాల్సిందేనని వెంటపడేవాడిని. ఆయన నన్ను తప్పించుకుని తిరిగేవారు. అయినా సరే వదలలేదు. ఇక నా బాధ తట్టుకోలేక ‘గీతాంజలి’ (Geethanjali) కథని సిద్ధం చేశారు. ముందు ఆ సినిమాను తమిళ్‌లో చేస్తానని అన్నారు. వద్దు.. తెలుగులో చేయమని చెప్పి, ఆయనను ఒప్పించాను. ఆ సినిమాతోనే తెలుగులోనూ ఆయన మార్కెట్ పెరిగింది..’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. అదన్నమాట ‘గీతాంజలి’ సినిమా వెనుక ఉన్న అసలు కథ.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు