- సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర గీతం
- రాష్ట్ర గీతం చుట్టూ రాజుకుంటున్న రాజకీయం
- కీరవాణితో రాష్ట్రగీతం కంపోజింగ్ చేయిస్తున్న సీఎం
- కీలక మార్పులు, చేర్పులు చేసిన అందెశ్రీ
- తెలంగాణలో సంగీత దర్శకులకు అవమానమంటూ ధ్వజం
- జూన్ 2న ఆవిర్భవ దినోత్సవాన గీతావిష్కరణకు సన్నాహాలు
- ఇప్పటికే పూర్తయిన రెండు నిమిషాల వ్యవధి పాట
- రాజకీయం చేద్దామనే యోచనలో ప్రతిపక్షాలు
cm reventh reddy change the state official song with mm keravani:
సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో శ్రద్ధ తీసుకుని కీలక మార్పులు, చేర్పులతో రాష్ట్ర గీతాన్ని తయారుచేయిస్తున్న సంగతి విదితమే. అయితే ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతానికి ఇప్పుడు కొత్తగా చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ గీతానికి ఉద్యమ సెగ తగులుకుంది. తెలంగాణ సినీ సంగీత దర్శకుల సంఘం ఈ మేరకు రాష్ట్ర సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ఓ సుదీర్ఘ లేఖను సైతం రాశారు. అసలు తెలంగాణ ఉద్యమ మూలాలేమిటి? సెంటిమెంట్ ఏమిటి లాంటి సున్నిత అంశాలను పక్కనబెట్టి..తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కనీసం ఇక్కడి ప్రాంతానికి చెందినవాడు కూడా కాని ఎంఎం కీరవాణితో గీతాన్ని కంపోజ్ చేయించడంపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో ఆవిష్కరణ
జూన్ 2 తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజునే ఈ గీతాన్ని ఆవిష్కరించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ దాదాపు 90 సెకండ్ల నుంచి 120 సెకండ్ల నిడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానుంది. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియాగాంధీ చేతుల మీదుగా ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో అందెశ్రీ, కీరవాణి సమావేశమయ్యారు. అందెశ్రీ ఒరిజినల్ రచనలోని భావం, ఆత్మ దెబ్బ తినకుండా ఆయన సమ్మతితో కొన్ని మార్పులు చేసి.. పాట నిడివి ఒకటిన్నర నిమిషాల నుంచి రెండు నిమిషాల వరకు ఉండేలా రూపొందించినట్లు సమాచారం.
ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్
తెలంగాణ పోరాట చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ప్రతిబింబించే రీతిలో గీతం సాగుతుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను.. నాడు స్కూళ్లు, కాలేజీల్లో ప్రార్థనా గీతంగా కూడా పాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పాట రాష్ట్ర గీతంగా ఉంటుందని అంతా భావించినా.. గత ప్రభుత్వం మాత్రం పక్కనపెట్టింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక గీతం ఉండాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. గత రెండు మాసాల్లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన గీతాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుని.. ఆహ్వాన పత్రికలు కూడా ముద్రిస్తున్న సమ యంలో అనూహ్యంగా తెలంగాణ గీతంపై.. వివాదం ముసురుకుంది. తెలంగాణ సినీ సంగీతకారుల సంఘం(టీసీఎంఏ) సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ లేఖను సంధించింది. గీత రచయిత అందెశ్రీ గురించి కాకుండా.. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి.ఈ సంఘం వివాదం రేకెత్తించింది. ఆయన మన వాడు కాదని.. ఎలా ఆయనతో సంగీతం అందిస్తారని.. గీతం బాధ్యతలను ఆంధ్రా సంగీత దర్శకుడికి ఎలా అప్పగిస్తారన్నది కీలకమైన పాయింట్.
సెంటిమెంట్ రాజేస్తున్న సాంగ్
అంతేకాదు.. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అణచివేతకు గురైన ఆంధ్రా కు చెందిన సంగీత దర్శకుడిని ఎలా నియమించారని.. ఇది ఇక్కడి ప్రతిభ గల సంగీత దర్శకులను అవమానించడమే నని.. వారికి అవకాశాలు రాకుండా అడ్డుకోవడమేనని సంఘం ప్రతినిధులు లేఖలో నిప్పులు చెరిగారు. ”సకల జనుల సహకారంతో… అమరవీరుల త్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ గీతాన్ని పక్క రాష్ట్రాలవాళ్లు పాడటం ఏమిటి? అలా చేస్తే తెలంగాణ కళాకా రులను అవమానించడమే. తెలంగాణలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. మన తెలంగాణ వారికి అవకాశమిచ్చి మనవా రికి గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాం” అని సంఘం ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.