MLA Rajesh Reddy: జర్నలిస్టులకు నేను అండగా ఉంటా
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి భరోసా
టీఏఈఎంజే జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రసంగం
నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అనుబంధ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు పుట్టపాగ వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. తమ సొంత అవసరాలను లెక్కచేయకుండా, కుటుంబానికి సమయం కేటాయించకుండా, ఎలాంటి ఆర్థిక లాభాపేక్ష లేకుండా సమాజ హితం కోసం జర్నలిస్టులు పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. జర్నలిస్టులు తనలాంటి జూనియర్ రాజకీయ నాయకులకు మంచి వార్తలతో ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలకు చేరడంలో జర్నలిస్టులు తగినంత అవగాహన కల్పించాలని కోరారు.
Read Also- Farmers Darna: యూరియా దొరక్క అన్నదాతల ఆవేదన
ప్రజా సమస్యలను సద్విమర్శతో వార్త కథనాలుగా రాయాలి తప్ప దురుద్దేశపూర్వకంగా ఉండకూడదని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచన చేశారు. జర్నలిస్టులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానుసారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కలెక్టర్‌తో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు.
Read Also- Manuguru Incident: పెద్ద కొడుకు నిర్వాకం.. భోరున ఏడుస్తున్న తల్లితండ్రులు
అంతకముందు సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, జిల్లా అధ్యక్షుడు పలుస విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర భాషాసాంస్కృతిక కమిటీ సలహా మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్ రావు, సీనియర్ జర్నలిస్టు రాములు మాట్లాడారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన కార్యవర్గాన్ని శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కర్ణయ్య, శ్యామ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, సురేష్, సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, సంఘం లీగల్ అడ్వైజర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.