Vote Chor Gadde Chod: ‘ఓట్ చోర్.. గద్దె చోడ్’ అనే నినాదంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బుధవారం జూమ్ మీటింగ్‌లో మహేశ్ మాట్లాడుతూ గురువారం (14న) రాత్రి 8 గంటలకు దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మాస్ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించోతున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, డీసీసీ కార్యవర్గం, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులు, బ్లాక్ అధ్యక్షులు అన్ని విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వరకు భారీ రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు, రాజధాని, ప్రధాన నగరాలలో ప్రదర్శన చేపట్టాలన్నారు. బీజేపీ ఈసీ కుమ్మక్కు పైన నాయకులు ప్రసంగించాలన్నారు. భారీ జన సమీకరణ చేపట్టాలని.. అన్ని విభాగాల నాయకులు సీనియర్ నాయకులు పాల్గొనాలని, పాదయాత్రలు, వాహన ప్రదర్శనలు చేపట్టాలని, ప్రజలను భాగస్వాములను చేసి బీజేపీ ఓట్ చోరీలపై ప్రసంగాలు చేయాలని సూచించారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు గడప గడపకు తిరిగి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణ చేయాలన్నారు.
Also Read: Manda Krishna Madiga: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శలు
సమిష్టిగా విజయవంతం..
నాయకులు రాష్ట్రమంతటా తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల తప్పిదాలు, ఫేక్ ఓటర్లను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని, ప్రత్యేక రిపోర్టు తయారు చేయాలని పీసీసీ అన్ని జిల్లాల ముఖ్య నాయకులకు సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టిన బీజేపీ, ఈసీ అక్రమాల ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి బాగా ప్రచారం చేయాలన్నారు. 24 నుంచి జనహిత పాదయాత్ర మొదలు కానుందని, నాయకులంతా సమిష్టిగా విజయవంతం చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు వెంటనే వేయాలన్నారు. ఇక అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాలు వెంటనే గాంధీభవన్‌కు పంపాలన్నారు. వరదలల్లో ప్రజలకు అండగా ఉండాలన్నారు. మండల కమిటీలను నెలాఖరు లోగా వేయాలని, గ్రామ కమిటీలను సెప్టెంబర్ 15 వరకు పూర్తి చేసి పంపాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మహేశ్ పిలుపునిచ్చారు.