TG Free Bus Scheme: ఆర్టీసీ మరో రికార్డు సాధించింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ( RTC)లో మునుపెన్నడూ లేని విధంగా ప్రయాణం చేశారు. మహిళలు(Women) సైతం వినియోగించుకున్నారు. ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు కేవలం ఆరు రోజుల్లోనే మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. అందులో మహాలక్ష్మి కింద 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గతేడాది రాఖీకి 2.75 కోట్ల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయగా.. ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు.
Also Read: Drugs Seized: హాష్ ఆయిల్ విక్రేతల అరెస్ట్.. 9 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు
గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ(rtc) బస్సుల్లో ప్రయాణించారు. ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గతేడాదితో పోలిస్తే 53 లక్షల కిలో మీటర్లను అదనంగా ఆర్టీసీ(rtc) సంస్థ తిప్పిందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆర్టీసీ ప్రస్తుత సర్వీసులతో పాటు అదనపు సర్వీసులను నడిపింది. ఈ నెల 7వ తేదీ నుంచి బస్సుసర్వీసులను నడపగా ఆ రోజూ 58.81లక్షల మంది ప్రయాణం చేశారు.
68.45లక్షల మంది
8వ తేదీన 57.53లక్షల మంది, 9వ తేదీన 66.40లక్ష మంది, 10వ తేదీన 56.76లక్షల మంది, 12వ తేదీన 60.30లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. అయితే, ఈ నెల 11న మాత్రం అత్యధికంగా 68.45లక్షల మంది ప్రయాణం చేయడం రికార్డు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నమ్మకం, ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలతోనే ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం పెరిగింది. అంతేకాదు సమస్యలపైనా అధికారులు స్పందిస్తూ ఎప్పటికప్పుడు చర్యలకు శ్రీకారం చుడుతుండడంతో ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు మహిళలకు సైతం ఉచిత ప్రయాణం కల్పించడం మరో కారణం. మహిళా సంఘాలకు చెందిన బస్సులను రవాణాశాఖలో పెట్టి వారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇస్తుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుని ఉచితంగా రాకపోకలు సాగించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సోదర, సోదరీమణుల బంధం ఎంత గొప్పదో ఈ రాఖీ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. సంస్థ సామర్థ్యాన్ని అంతా ఉపయోగించుకుని రాఖీ పండుగకు రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాఖీ పండుగను త్యాగం చేసి, భారీ వర్షాల్లోనూ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని వారి సేవలను కొనియాడారు. విపరీతమైన రద్దీలోనూ మహాలక్ష్మి -మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు.
నిబద్ధతతో పనిచేయడం వల్లనే సాధ్యమైంది
= టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయడం వల్ల రాఖీ పండుగకు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ రాఖీ పండుగ ఆపరేషన్స్ సంస్థలో సరికొత్త రికార్డులను నమోదు చేసిందన్నారు. ఈ నెల 11న ఒక్క రోజులో అత్యధికంగా 68.45 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి ఈ రాఖీ పండుగ రికార్డులే నిదర్శనమన్నారు. టీజీఎస్ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్న, ప్రోత్సహిస్తున్న ప్రయాణికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Telangana Rains: బీ కేర్ ఫుల్ అప్రమత్తంగా ఉండండి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు?