TGSPDCL: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వానలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఉండటంపై దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా ఈనెల 17 వరకు ఎస్పీడీసీఎల్(SPDCL) ఉద్యోగులకు లీవులు లేవని సర్క్యులర్‌ను రిలీజ్ చేసింది. నిర్దిష్ట కారణాలు లేనిదే ఎవరూ సెలవులు పెట్టకూడదని ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలాఉండగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు దాదాపు 229 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ల నుంచి డివిజనల్ ఇంజినీర్ల వరకు విధుల్లోనే ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) ఆదేశించారు. అందులో అసిస్టెంట్ సెక్రటరీలు, పర్సనల్ ఆఫీసర్లు, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు, జీఎంలు, అకౌంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కౌంట్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉన్నారు. అంతేకాకుండా విద్యుత్ అంబులెన్స్ తరహాలో 167 ఎమర్జెన్సీ వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
విద్యుత్ అంబులెన్సు తరహాలో
ఇంజినీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్ క్వార్టర్ లో 24 గంటలు అందుబాటులో ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీచేశారు. కార్పొరేట్ కార్యాలయంతో పాటు, ఇతర జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పని చేసే దాదాపు 229 మంది ఇతర విభాగాల అధికారులను, సిబ్బందిని క్షేత్రస్థాయి ఆపరేషన్ సర్కిళ్లకు కేటాయించారు. సంస్థ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా ఆపరేషన్స్ అండ్ మెయింటెనన్స్ సిబ్బందిని నియమించారు. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నగరంలో 213 సెక్షన్ ఆఫీసులకు చెందిన ఫ్యుజ్ కాల్ ఆఫీస్ ల్లో జీపీఎస్ ఆధారంగా పని చేసే అత్యాధునిక ఆటో(Auto)లు, సంస్థ పరిధిలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ అంబులెన్సు తరహాలో 167 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలు సరిపడా సిబ్బంది మరియు పరికరాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read: Bhatti Vikramarka: గత ప్రభుత్వం బకాయిలు 45వేల కోట్లు… డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ
సిద్దిపేట(Sidhipeta) జిల్లా బస్వాపూర్ సెక్షన్ పరిధిలో భారీ వర్షం, గాలి కారణంగా నాగసముద్రం చెరువు గుండా వెళ్లే లక్ష్మీపూర్ 11 కేవీ ఫీడర్/కండక్టర్ తెగిపోయింది. దీంతో 3 గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచింది. ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రాంత లైన్ మెన్ హైమొద్దీన్ తన సహాయక సిబ్బంది రాజేందర్, అసిస్టెంట్ లైన్ మెన్ హరీష్, గ్రామ విద్యుత్ కార్మికుడి సహాయంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు రంగంలోకి దిగారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చారు. విధి నిర్వహణపై వారు చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ఎస్పీడీసీఎల్ సీఎండీ వారిని అభినందించారు. అంతేకాకుండా డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరి సమక్షంలో అభినందించారు.
అపార్ట్ట్ మెంట్ సెల్లార్లలో
క్షేత్రస్థాయి తనిఖీలో భాగంగా హుస్సేన్ సాగర్ సబ్ స్టేషన్ ను సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పరిశీలించారు. ఈఆర్టీ వాహనాలను, ఎఫ్ వోసీ ఆటోల్లో ఉన్న పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. అతి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద అపార్ట్ట్ మెంట్ సెల్లార్లలో చేరి విద్యుత్ మీటర్లు ఉన్న ప్యానల్ బోర్డును తాకే అవకాశముంటుందని, అలాంటి ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు కలిగినా తమ విద్యుత్ బిల్లుపై కింది భాగంలో ముద్రించిన అధికారులకు కానీ, 1912 లేదా స్థానిక ఎఫ్ వోసీకి కానీ లేదా సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ లకు కానీ కాల్ చేయాలని సూచించారు.
Also Read: TGSRTC: రాష్ట్రంలో స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు: టీజీఎస్ఆర్టీసీ
జీహెచ్ఎంసీ పరిధిలోని సర్కిల్స్
హైదరాబాద్ సెంట్రల్ 87124 69862
హైదరాబాద్ సౌత్ 87124 70596
సికింద్రాబాద్ 87124 70535
బంజారా హిల్స్ 87124 68948
సైబర్ సిటీ 87124 69534
రాజేంద్ర నగర్ 87124 70075
సరూర్ నగర్ 87124 72315
హబ్సిగూడ 87124 71466
మేడ్చల్ 87124 72559
రూరల్ సర్కిల్స్
నల్లగొండ 87124 69138
యాదాద్రి 87124 71768
సూర్యాపేట 87124 72773
మహబూబ్ నగర్ 87124 72127
వనపర్తి 87124 71758
నాగర్ కర్నూల్ 87124 70915
గద్వాల్ 87124 71713
మెదక్ 87124 73356
సంగారెడ్డి 87124 73116
సిద్దిపేట 87124 71037
వికారాబాద్ 87124 69795
నారాయణపేట్ 87124 70307