SC on MLCs: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ లకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా వారి నియమకాన్ని రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అసలేంటీ వివాదం?
తెలంగాణలో గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యుల నియామకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం జరుగుతుంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలను గవర్నర్ నియమిస్తారు. అయితే ప్రభుత్వాలు సూచించిన వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, గత బీఆర్ఎస్ హయాంలోనే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సిఫారసులను తిరస్కరించారు. ఎందుకంటే వారు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేరని చెబుతూ రెండేళ్లపాటు ఆ స్థానాలను ఖాళీగానే ఉంచారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నియామకం
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టులో ప్రొఫెసర్ కోదండరాం (తెలంగాణ జన సమితి నాయకుడు, విద్యావేత్త), అమీర్ అలీఖాన్ (సీనియర్ జర్నలిస్ట్)లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. గవర్నర్ ఈ సిఫారసులను ఆమోదించడంతో 2024 ఆగస్టు 16న శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు.
బీఆర్ఎస్ నాయకుల పిటిషన్
బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ తమ పేర్లను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసినప్పటికీ గవర్నర్ తిరస్కరించారని.. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలు చట్టవిరుద్ధమని వాదిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు 2024 మార్చి 7న ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. గవర్నర్ సిఫారసు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో సవాలు చేయబడటంతో హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గవర్నర్ నిర్ణయాలను నియంత్రించలేమని చెప్పి కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించింది. అయితే బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టులో మరోసారి దీనిని సవాల్ చేశారు.
Also Read: Sridhar Babu: ఐటీ మంత్రికి అరుదైన గౌరవం.. టాప్-100లో చోటు.. మ్యాటర్ ఏంటంటే?
చట్టపరమైన లోపాలు
2025 ఆగస్టు 13న సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీనికి కొన్ని కారణాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. పిటిషనర్లు (దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ) వాదనల ప్రకారం కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కి అనుగుణంగా జరగలేదు. కాబట్టి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం చెల్లదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు సమర్థించిన వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఈ నియామకాలు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది. గవర్నర్ సిఫారసు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడంతో పాటు అర్హతల ఎంపికలో లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకాలను రద్దు చేస్తూ.. తదుపరి విచారణ సెప్టెంబర్ 17, 2025కి వాయిదా వేసింది.