Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’ (Mothevari Love Story) స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్. ఇది జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శివ కృష్ణ బుర్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల, మురళీధర్ గౌడ్, సదన్న, విజయలక్ష్మి తదితరులు నటించారు. ‘మై విలేజ్ షో’తో యూట్యూబ్‌లో పాపులర్ అనిల్ గీలా ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేశాడు. ఏడు ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ రూపొందింది. కామెడీతో అందరినీ నవ్విస్తూ మంచి టాక్ తెచ్చుకుంది ఈ వెబ్ సిరీస్.
స్టోరీ ఏంటంటే..?
తెలంగాణలోని ఆలేరు మండలంలో ఉన్న రెండు గ్రామాల చుట్టూ కథ తిరుగుతుంది. మోతెవరి పరశురాములు అనే వ్యక్తి ఆత్మహత్యతో కథ ప్రారంభమవుతుంది. అతని కొడుకులు సత్తయ్య (మురళీధర్ గౌడ్), నర్సింగ్ యాదవ్ (సదన్న) గ్రామంలో పెద్దమనుషులుగా వ్యవహరిస్తారు. సత్తయ్య కూతురు అనిత (వర్షిణి), పర్శి (అనిల్ గీలా) ప్రేమలో ఉంటారు. వీరు ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో, పరశురాములు హైదరాబాద్‌లో 5 గుంటల స్థలాన్ని హనుమవ్వ (విజయలక్ష్మి)కి రాసిచ్చినట్లు వీలునామా ద్వారా తెలుస్తుంది. హనుమవ్వ పర్శి అమ్మమ్మ. ఆ స్థలం కోసం సత్తయ్య, నర్సింగ్‌లు హనుమవ్వతో బేరసారాలు చేస్తారు. హనుమవ్వ, తన మనవడు పర్శికి అనితతో పెళ్లి చేస్తేనే స్థలం ఇస్తానని షరతు పెడుతుంది. దీంతో సత్తయ్య ఒప్పుకుంటాడు, కానీ నర్సింగ్ దీన్ని స్థలం కోసం సత్తయ్య చేస్తున్న కుట్రగా భావిస్తాడు. ఇది అన్నదమ్ముల మధ్య మనస్పర్థలకు దారితీస్తుంది. పర్శి,అనితల పెళ్లి జరిగిందా? హనుమవ్వకు మోతెవరి స్థలం ఎందుకు రాసిచ్చాడు? ఈ ప్రశ్నల చుట్టూ కథ నడుస్తుంది.
Read also- The Raja Saab: చిక్కుల్లో ‘ది రాజా సాబ్’.. ఇక విడుదల కష్టమే!
ప్లస్ పాయింట్స్
తెలంగాణ నేపథ్యం: పక్కా గ్రామీణ వాతావరణం, తెలంగాణ యాస, సంస్కృతి, డైలాగ్‌లు సిరీస్‌కి ప్రాణం పోశాయి. గ్రామీణ జీవనశైలి, రీల్స్ పిచ్చి, కుటుంబ బంధాలు బాగా చూపించారు.
నటన: అనిల్ గీలా తన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. వర్షిణి రెడ్డి రీల్స్‌కి అలవాటు పడిన గ్రామీణ అమ్మాయిగా సరిపోయింది. మురళీధర్ గౌడ్, సదన్న అన్నదమ్ములుగా, విజయలక్ష్మి హనుమవ్వగా ఆకట్టుకున్నారు.
కామెడీ: మొదటి నాలుగు ఎపిసోడ్‌లు కామెడీతో నవ్వించాయి. పర్శి-అనిత ముచ్చట్లు, పారిపోయే సన్నివేశాలు, గంగవ్వ కామియో హైలైట్‌గా నిలిచాయి.
సాంకేతికత: శ్రీకాంత్ అప్పుల సినిమాటోగ్రఫీ గ్రామీణ దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించింది. చరణ్ అర్జున్ సంగీతం, ముఖ్యంగా ‘ఎలదరియా’ పాట, ఫోక్ టచ్‌తో హృదయాన్ని ఆకట్టుకుంది.
Read also- Aamir Khan – Coolie: ‘కూలీ’ సినిమాకు అమీర్ ఖాన్ కు ఇచ్చింది ఎంతంటే..
మైనస్ పాయింట్స్
సాగదీత: మొదటి రెండు ఎపిసోడ్‌లు నెమ్మదిగా సాగాయి, ఏడో ఎపిసోడ్‌లో కథను హడావిడిగా ముగించారు.
ఎమోషనల్ డెప్త్ లోపం: హాస్యానికి ప్రాధాన్యమిచ్చినప్పటికీ, భావోద్వేగ సన్నివేశాలు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేదు. క్యారెక్టర్ ఆర్క్‌లు సరిగా అభివృద్ధి చేయలేదని విమర్శలు వచ్చాయి.
సౌండ్‌ట్రాక్ : కొన్ని సన్నివేశాల్లో సంగీతం కథకు సరిపోలేదు, ఇది పేస్‌ని నెమ్మదించింది.
‘మోతెవరి లవ్ స్టోరీ’ ఒక ఆహ్లాదకరమగా, తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించే వెబ్ సిరీస్. కామెడీ, రొమాన్స్, కుటుంబ బంధాలతో మొదట నెమ్మదిగా సాగినా, మూడో ఎపిసోడ్ నుంచి ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ డెప్త్, స్క్రీన్‌ప్లేలో ఒడిదొడుకులు లేకపోతే ఇంకా బాగుండేది. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి బింగ్-వాచ్ చేయడానికి ఇది ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్.
రేటింగ్: 3/5
