The Raja Saab: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాకపోతే, ఆ డేట్‌కి ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమే అని తెలుస్తుంది. అవును, ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో ఈ సినిమా విడుదలపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలియంది కాదు. చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నా, ఏ ఒక్కటీ విడుదల కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మారుతి (Director Maruthi) దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నెక్ట్స్ విడుదల లిస్ట్‌లో ఉంది కానీ, ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎప్పుడు ప్రకటన వచ్చినా, ఏదో ఒక అంతరాయం కలుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)పై రూ. 218 కోట్ల స్కాం పేరుతో ఢిల్లీలో కేసు నమోదైంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read- Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5 విడుదల అని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ‘ది రాజా సాబ్’ విడుదల మరోసారి వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ 5కి ఈ సినిమా రావడం లేదని, కొంత పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా రాబోయే సంక్రాంతికి విడుదల అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అసలిప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అనేలా వార్తలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొదట రూ. 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు, కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు దాదాపు రూ. 400 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందట. సడెన్‌గా ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఫైనాన్షియల్ పార్టనర్‌గా ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్స్ (IVY Entertainments)ను చేర్చుకుందట.
ఇప్పుడదే ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు ఈ సినిమా నిర్మాతపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఒక టైమ్ చెప్పి, ఆ టైమ్ లోపు సినిమా పూర్తవుతుందని సదరు బ్యానర్ నిర్మాతలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒప్పందం చేసుకుందట. కానీ ఈ సినిమా అనుకున్న టైమ్‌కి పూర్తి కాకపోవడంతో.. తమ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకున్న ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ నిమిత్తం వారిచ్చిన రూ. 218 కోట్లు, 18 శాతం వడ్డీతో తక్షణమే చెల్లించాలని కోర్టులో కేసు ఫైల్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు, వారు కోర్టుకు వెళ్లడానికి మరో కారణం కూడా ఉంది. వారిచ్చిన రూ. 218 కోట్లకు లెక్కలు అడిగినా చూపించడం లేదట. అందుకే, కోర్టులోనే తేల్చుకోవాలని ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్స్ కేసు ఫైల్ చేయించిందని టాక్ వినబడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ ఫిటీషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది.
Also Read- Jr NTR: ఎన్టీఆర్ స్పీచ్ వార్ 2 కి మైనస్ గా మారిందా..? సినిమా రిజల్ట్ డౌటే అంటున్న నెటిజన్స్?
మొత్తంగా అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే తేలేలా లేదనేలా ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. ఫైనల్‌గా ఈ గొడవలు ఎంత వరకు వెళతాయో.. ఎప్పుడు ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల అవుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హారర్ కామెడీ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు