Hyderabad Rains: జర భద్రం.. నేటి నుంచి సిటీకి రెడ్ అలర్ట్
4 రోజుల అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు, జలమండలి
జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఉద్యోగుల సెలవులు రద్దు
రంగంలోకి 4 వేల మందితో హైడ్రా బృందాలు
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ వాసులారా.. తస్మాత్ జాగ్రత!!. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు నగరవాసులను అప్రమత్తం చేసింది. బుధ, గురువారాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్, ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. దీంతో, వర్షాకాలం నగరంలో సహాయక చర్యల్లో చురుగ్గా భాగస్వామ్యమవుతున్న హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సైతం అప్రమత్తమైనట్లు సమాచారం.
ఇటీవలే సిటీలో భారీ వర్షం కురిసి నగరం అతలాకుతలం అయింది. గంటలోనే 11 సెం.మీ.ల నుంచి 12 సెం.మీ.లు పైచిలుకు వర్షపాతం నమోదైంది. అంచనా వేసినట్టుగానే అమీర్‌పేటపై ఈ ప్రభావం ఎక్కువ పడింది. దీంతో, ఆ ప్రాంతంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఈ నెల 9న కూడా రాత్రంతా వర్షం కురవటంతో మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అమీర్ పేట ప్రాంతంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ రెండు పర్యాయాలు కురిసిన వర్షం కన్నా అధిక వర్షపాతం బుధ, గురువారాల్లో నమోదవ్వొచ్చనే అంచనాలు ఉండడంతో హైడ్రా, జీహెచ్ఎంసీలో ఇప్పటికే సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి.
Read Also- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు సీవీఐ వ్యాధి.. లక్షణాలు ఇవే
సుమారు 4 వేల పైచిలుకు సిబ్బందితో ఏర్పాటైన హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు అన్నీ సేవలు అందించేందుకు వీలుగా 24 గంటలూ సిద్దంగా ఉంటున్నాయి. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. ఇదిలావుంచితే, హైదరాబాద్ జిల్లాలో తరచూ వర్షాలు కురుస్తుండటం, బుధవారం నుంచి రెడ్ అలర్ట్ ప్రకటించటతో సహాయక చర్యలు చేపట్టాల్సిన హైడ్రా, జీహెచ్ఎంసీలు కూడా సిబ్బందిని హై అలర్ట్ చేశాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పా, బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. సిటీకి భారీ వర్షాల అలర్ట్ కారణంగా ఈ నెల 15న గొల్కొండ కోటలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, వాటర్ ప్రూఫ్ షామీయాణాలు, వాటర్ ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్, త్రాగునీరు, బారికేడింగ్, గ్యాలరీలు, వచ్చే అతిథులు, విద్యార్థులు, సందర్శకులకు, ప్రజలకు సీటింగ్ కెపాసిటీ, సౌండ్ సిస్టం తదితర అంశాలపై ఉన్న స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆ రెండింటిపైనే ప్రధానంగా ఫోకస్
నగరానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, వాటికి సహకరించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బృందాలన్నీ రెండు పాయింట్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. సిటీలోని అన్ని సర్కిళ్లలో కలిపి ఇప్పటికే గుర్తించిన 144 వాటర్ లాయింగ్ పాయింట్లతో పాటు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లలో వర్షపు నీరు నిల్వకుండా ఏర్పాటు చేసిన 6 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లపైనే ప్రధానంగా దృష్టి సారించేందుకు సిద్దమైనట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం ఆరు హోల్డింగ్ స్ట్రక్చర్లతో పాటు 144 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటిని తోడేసేందుకు ఎక్కువ సామర్థ్యం కల్గిన మోటార్లతో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండు పాయింట్ల వద్ద భారీ వర్షం కురిసినపుడు నిలిచే నీటిని ఎప్పటికపుడు తోడేస్తే వాటర్ లాగింగ్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుందని హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
Read Also- School Holidays: ఏపీ, తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
నాలాల వద్ద డీఆర్ఎఫ్ టీమ్‌లు
నగరంలో భారీ వర్షాలు కురిసనపుడు గతంలో పలువురు నాలాల్లో పడి కొట్టుకుపోయిన ఘటనలు జరగ్గా, ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే గుర్తించిన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మేజర్ నాలాల వద్ద హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నాలాల్లో పడి కొట్టుకుపోయిన వారిని రక్షించేలా సుక్షితులైన వారినే మేజర్ నాలాల వద్ద విధి నిర్వహణకు ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో పాటు జీహెచ్ఎంసీ హుస్సేన్ సాగర్ లో పెరుగుతున్న వరద నీటి ఉద్దృతను ఎప్పటికపుడు పర్యవేక్షించాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి వస్తున్న ఇన్ ఫ్లోను పరిశీలిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.