- నేడు ఆరు రాష్ట్రాలలో జరగనున్న 6వ దశ పోలింగ్
- 58 స్థానాలలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో
- ఆరవ దశ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా
- బీజేపీకి మెజారిటీ రావాలంటే ఆరవ దశ కీలకం
- హర్యానాలో 10 ,ఢిల్లీలో 7 స్థానాలలో పోలింగ్
- హర్యానా, ఢిల్లీలో బీజేపీకి ఎదురుగాలి
- రెండు చోట్లా ఆమ్ ఆద్మీదే హవా
- ఇండియా కూటమికి కీలకం కానున్న 6వ దశ ఎన్నికలు
6th phase elections poling today 6 states with 889 candidates participating:
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఆరవ దశతో పాటు జూన్ 1న జరగనున్న 7వ విడత ఎన్నికలతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక శనివారం జరుగుతున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరవ విడత ఎన్నికలలో మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 58 స్థానాలకు గానూ నేడు పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ ఆరవ దశ ఎన్నికలలో తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. ఇదే విడత ఎన్నికలలో హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 సీట్లకు ఎన్నిక జరగనుంది. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్-రాజౌరీ లోక్ సభ స్థానానికి మూడో విడతలోనే ఎన్నిక జరగాల్సి వుండగా..సాంకేతిక పరమైన ఇబ్బందులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ ఎన్నికలు కూడా ఇదే విడతలో జరగనున్నాయి.
పోటాపోటీగా అభ్యర్థులు
హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్ తక్, భివానీ, మహేంద్రగడ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లో పోలింగ్ జరగనుంది. వీటిలో బీజేపీ మొత్తం 10 స్థానాలలో పోటీచేస్తోంది. కురుక్షేత్ర లోక్ సభ స్థానంలో ఈసారి బీజేపీ తరపున నవీన్ జిందాల్ పోటీచేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీ్ గుప్తా, ఐఎన్ఎల్ డీ అభ్యర్థిగా అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. గురుగ్రామ్ లోక్ సభ స్థానంలో 2014, 2019లలో బీజేపీ గెలిచింది. హ్యాట్రిక్ కోసం మరోసారి రావ్ ఇందర్‌జీత్ సింగ్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ బరిలో నిలిచారు. రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హూడా, బీజేపీ నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు.ఢిల్లీలోని ఏడు స్థానాలకూ ఇదే విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె భన్సూరీ స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున మీనాక్షీ లేఖీ గెలిచారు. ఈశాన్య ఢిల్లీ స్థానంలో బీజేపీ గత రెండు ఎన్నికల్లో విజయం సాధించింది. హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ నేత మనోజ్ తివారీ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు.
ప్రాంతీయ పార్టీలకు అగ్నిపరీక్ష
అయితే ఈ 58 లోక్ సభ నియోజక వర్గాలలో గత ఎన్నికలలో ఎక్కువ సీట్లను ఎన్టీయే కూటమి గెలుచుకుంది. అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న ఇండియా కూటమి ఈ 58 స్థానాలలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటేనే అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీని ఓడించి ఇండియా కూటమి తన సత్తా చాటితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఫిగర్‌కు ఇండియా కూటమి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఆరో దశ ఎన్నికలు జరగనున్న 58 లోక్ సభ స్థానాలలో 2019 లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ఈసారి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి ఖాతా తెరవడమే కాకుండా బీజేపీ గతంలో గెలిచిన సీట్ల సంఖ్యను తగ్గించి మెజారిటీ సీట్లను సాధించుకోవాల్సి ఉంటుంది. మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే మరోసారి ఈ 58 నియోజకవర్గాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలకు ఆరో దశ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరో దశలో ఎవరు అధిపత్యం కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పది స్థానాలలో బీజేపీ ఎదురీత
నేడు జరగనున్న లోక్ సభ ఎన్నికల ఆరవదశలో బెంగాల్, ఒడిషా మిగతా రాష్ట్రాలలో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. హర్యానాలో బలంగా రైతు ఉద్యమకారులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయనున్నారు. పైగా హర్యానాలో జాట్ ల ప్రభావం ఎక్కువ ఈ సారి జాట్ లంతా సమష్టిగా ఆమ్ ఆద్మీ భాగస్వామ్యంగా ఉన్న ఇండియా కూటమికే సపోర్ట్ గా నిలవనున్నారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఢిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్ పై సానుభూతి పెరిగింది ఓటర్లకు. బీజేపీ కావాలనే కేజ్రీని అరెస్ట్ చేయించిందని ఈ సారి జరగబోయే ఎన్నికలలో మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారు ఓటర్లు అంటున్నారు రాజకీయ పండితులు. దీనితో ఈ దశలో దాదాపు 10 స్థానాలను బీజేపీ కోల్పోతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.