Rana Daggubati: బెట్టింగ్ యాప్‌ల కేసులో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati) సోమవారం ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటలపాటు ఆయనను విచారించిన అధికారులు, పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురి ఆత్మహత్యలకు కారణం అవటంతోపాటు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటానికి కారణం అయిన బెట్టింగ్ యాప్‌లపై (Betting Apps Promotion) మొదట పంజాగుట్ట, మియాపూర్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిలో టాలీవుడ్, బుల్లితెరకు చెందిన 29 మంది నటీనటులు నిందితులుగా ఉన్నారు. ఆ తర్వాత కేసులు సీఐడీ అదనపు డీజీపీ నేత్రుత్వంలోని సిట్‌కు బదిలీ అయ్యాయి. కాగా, ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా అనుమానాలు ఉండటంతో ఇటీవల ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలతోపాటు ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి వారందరికీ నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కాగా, జంగిల్ రమ్మీ అనే యాప్‌ను ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి సోమవారం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. తన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అయిదు సంవత్సరాల వివరాలను ఆయన అధికారులకు అందించారు. సుమారు మూడు గంటలపాటు రానాను ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి కీలక వివరాలు తీసుకున్నారు. యాప్ ప్రమోట్ చేసినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు? చెల్లింపులు ఎలా జరిగాయి? అన్న సమాచారాన్ని అధికారులు తీసుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన రానా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. కాగా, ఈనెల 13న మంచు లక్ష్మి (Manchu Lakshmi) విచారణకు హాజరు కావాల్సి ఉంది. రానా కంటే ముందు ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. అధికారికంగా ఓ లేఖను విడుదల చేసి.. తను ప్రమోట్ చేసిన యాప్‌కు అనుమతి ఉందని తెలిపారు. కానీ రానా మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Also Read- Viral Video: ఏనుగుతో చెలగాటం.. చావు అంచుల వరకూ వెళ్లిన వ్యక్తి.. ఎలాగో మీరే చూడండి!
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఏం చెప్పారంటే.. రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరని అన్నారు. వీటి మధ్య తేడా ఏంటనేది తెలుసుకుని మీడియా వారు ప్రచారం చేయాలని అన్నారు. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లకు స్పాన్సర్స్ చేస్తుంటాయని, తను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్‌కు అని వెల్లడించారు. ఇది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ అని, ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించానని వివరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు