Sai Durgha Tej: యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమాన్ని శనివారం (ఆగస్ట్ 9) హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన అవార్డ్స్ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులెందరో హాజరై సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej)కు మోస్ట్ డిజైరబుల్ (మేల్) అవార్డ్ (Most Desirable Male 2025) వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఈ అవార్డును సాయి దుర్గ తేజ్‌కు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డును తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గ తేజ్ కోరారు. ఇక ఈ వేదికపైనే ఈ అవార్డుని, గౌరవాన్ని సాయి దుర్గ తేజ్ తన తల్లికి అంకితం చేయడం విశేషం.
Also Read- Coolie booking : అడ్వాన్స్ బుకింగ్‌లో ఆ సినిమాల గ్రాస్ కలెక్షన్‌లను దాటేసిన ‘కూలీ’
ఈ అవార్డును తన తల్లికి అంకింతం ఇవ్వడానికి కారణం కూడా సాయి దుర్గ తేజ్ ఈ వేడుకలో తెలిపారు. తనకు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తన తల్లి తనని కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘నేను అంతా కోల్పోయానని అనుకున్నప్పుడు, మా అమ్మ నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. ఆమె నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు’ అని అన్నారు. అందుకే ఈ గౌరవం అమ్మకు దక్కాలని కోరుకుంటున్నట్లుగా సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చారు.
ఇక తనకు వచ్చిన అవార్డ్ గురించి మాట్లాడుతూ.. ఎవరైనా సరే కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్ని ధరించండి. ప్రశాంతంగా, సంతోషంగా, ఉండండని అన్నారు. తన స్టైల్ ఐకాన్‌లుగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లను ఆయన ఎంచుకున్నారు. ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ తన ఆల్ టైం ఫేవరేట్ స్టైల్, లుక్స్ అని ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని, అడివి శేష్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, మాళవిక మోహనన్, తేజ సజ్జా, అనిల్ రావిపూడి, నాగ వంశీ, ప్రగ్యా జైస్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, భాగ్యశ్రీ బోర్సే, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, చిన్మయి శ్రీపాద, దేవి శ్రీ ప్రసాద్ వంటి సినీ ప్రముఖులెందరో పాల్గొన్నారు.
Also Read- Operation Akarsh: బీజేపీలో నేతల మధ్య చిచ్చు పెడుతున్న చేరికలు
సాయి దుర్గ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ చేసిన ‘విరూపాక్ష’ చిత్రం సంచలన విజయాన్ని అందుకుని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటి గట్టు (SYG)’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా… హై-బడ్జెట్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను 2025 చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
