srushti fertility case: సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ డాక్టర్ నమ్రత(Dr. Namrata) ఆమెకు సహకరించిన వారి పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసులు విశాఖపట్టణంలో మరో అయిదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు. దీంతో వైజాగ్ నుంచి అరెస్టయిన వారి సంఖ్య 6కు చేరింది. సరోగసి ద్వారా అమ్మానాన్నలను చేస్తామని నమ్మించిన డాక్టర్ నమ్రత 30లక్షలు తీసుకుని మరొకరికి పుట్టిన బిడ్డను రాజస్తాన్కు చెందిన గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ(DNA) పరీక్షల్లో ఆ బిడ్డ తమకు పుట్టలేదని నిర్ధారణ కావటంతో గోవింద్ సింగ్(Govibd singh) దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో డాక్టర్ నమ్రత సంతాన సాఫల్య కేంద్రం పేర నడుపుతూ వచ్చిన చైల్డ్ ట్రాఫికింగ్(Child Trafficking) వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మరో ఇద్దరు వైద్యులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు తాజాగా విశాఖపట్టణంలోని కేజీహెచ్(KGH Hospital) ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ వాసుపల్లి రవి, డాక్టర్ ఉషాదేవిలను అరెస్ట్ చేశారు. డాక్టర్ వాసుపల్లి రవి హాస్పిటల్ లోని అనస్తీషియా విభాగంలో పని చేస్తుండగా డాక్టర్ ఉషాదేవిUha Dadevi) ప్రసూతి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది.
కాసులకు కక్కుర్తి పడి
కాసులకు కక్కుర్తి పడ్డ డాక్టర్ వాసుపల్లి రవి, డాక్టర్ ఉషాదేవిలు డాక్టర్ నమ్రత కొనసాగించిన అక్రమాలకు పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సంతానం కోసం హైదరాబాద్‌లో తనను సంప్రదించిన దంపతులకు సరోగసి ద్వారా బిడ్డ కలిగేలా చేస్తామని నమ్మించి డాక్టర్ నమ్రత విశాఖపట్టణం బ్రాంచ్ కు పంపించేది. ఇక్కడ నిర్వాహకురాలిగా పని చేసిన కళ్యాణి ఇలా వచ్చిన భార్యాభర్తలను తన మాయ మాటలతో పూర్తిగా నమ్మించేది. సరోగసికి మహిళ సిద్ధంగా ఉన్నట్టు చెప్పి దంపతుల్లో భర్త నుంచి వీర్యం సేకరించేది.
Also Read: Vasavi Construction Company: కూకట్ పల్లి పోలీసులకు.. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫిర్యాదు
అయితే, సరోగసి ద్వారా కాకుండా మరొకరికి పుట్టిన శిశువులను లక్ష నుంచి 5లక్షల రూపాయలకు కొని తమ వద్దకు వచ్చిన వారి నుంచి 30 నుంచి 40లక్షలు తీసుకుని ఇచ్చేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే డబ్బుకు ఆశ పడి పిల్లలను అమ్ముకోవటానికి సిద్ధమైన మహిళలకు వైజాగ్ బ్రాంచ్ లోనే ప్రసవాలు చేయిస్తూ రావటం. దీంట్లో డాక్టర్ ఉషాదేవిదే కీలక పాత్ర అని పోలీసు వర్గాల నుంచి తెలియవచ్చింది. అనస్తీషియా(Anesthesia) డాక్టర్ వాసుపల్లి రవి(Ravi) ఆమెకు సహకరించేవాడని సమాచారం. అరెస్టయిన డాక్టర్ వాసుపల్లి రవి వైఎస్సార్(YSR) సీపీ మాజీ ఎమ్మెల్యేకు సోదరుడని తెలిసింది.
పట్టుబడ్డ ఏజెంట్లు
దర్యాప్తులో భాగంగా పోలీసులు డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించిన విజయ్(Vijay), సరోజ9saroja), రత్నలను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు పేదరికంలో మగ్గుతూ గర్భం దాల్చిన మహిళలను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించి ఉచ్ఛులోకి లాగేవారని సమాచారం. ఇలాంటి మహిళలను గుర్తించేందుకు డాక్టర్ నమ్రత గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహించినట్టుగా తెలియవచ్చింది. ఇక, ముందు ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరు రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వారు ఉన్నట్టుగా పేర్కొంటున్నారు.
సిట్‌కు అప్పగించే యోచన
కాగా, సంచలనం సృష్టిస్తున్న యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Universal Creation Test Tube Baby Center) కేసును సిట్ కు అప్పగించాలని నార్త్ జోన్ పోలీసులు యోచిస్తున్నట్టుగా సమాచారం. డాక్టర్ నమ్రత గ్యాంగ్ మహారాష్ట్ర(Maharashtra), ఒడిషా(Odisha), వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా పిల్లలను కొని తెచ్చి సరోగసి ద్వారా పుట్టిన పిల్లలని పలువురికి అప్పగించినట్టుగా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కూడా విచారణ జరపాల్సి ఉంటుంది. పకడ్భంధీగా దర్యాప్తు చేయాలంటే కేసును సిట్ కు అప్పగించటమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు) నేతృత్వంలో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
Also Read: Drugs Seized: డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ దాడులు.. ఎండీఎంఏ గంజాయి స్వాధీనం
