Hyd Rain Updates:
తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్షపాతం
నిజమవుతున్న నిపుణుల హెచ్చరికలు
సిటీకి ఆరెంజ్ అలర్ట్
బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లలో కుండపోత
రోడ్లపై వాటర్ లాగింగ్, భారీగా ట్రాఫిక్ జామ్
రంగంలోకి దిగిన హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం కుంభవృష్టి వాన (Hyd Rain Updates) కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో భారీ వర్షం నమోదయింది. జీహెచ్ఎంసీ ఇటీవలే నియమించుకున్న వాతావరణ నిపుణలు హెచ్చరించినట్టుగానే, తీవ్ర వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు సుమారు 5 నుంచి 15 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుందని నిపుణలు హెచ్చరించారు. గురువారం రాత్రంత వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. దీంతో, జీహెచ్ఎంసీ, హైడ్రాలు ముందస్తుగా అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా, జలమండలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. హైడ్రా, జలమండలి టీమ్‌లు నీళ్లు నిలిచిన పాయింట్ల వద్ద నీటిని తోడేసే విధుల్లో నిమగ్నమయ్యాయి.
గచ్చిబౌలిలో 8.5 సెం.మీ.ల వర్షపాతం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు సుమారు 5 నుంచి 15 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణలు అప్రమత్తం చేసిన దానికంటే ఎక్కువ వర్షం కురిసింది. సిటీలో అత్యధికంగా గచ్చిబౌలిలో 8.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 6.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 5.6 సెం.మీ, రాయదుర్గంలో 5.2 సెం.మీ, అమీర్‌పేటలో 4.9 సెం.మీ, గోల్కొండలో4.6 సెం.మీ, యూసుఫ్ గూడలో 4.4 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, భారీ వర్షం కురిసిన ఈ ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.
6 తర్వాత కుంభవృష్టి..
నిపుణల అలర్ట్ ప్రకారం మధ్యాహ్నాం మూడున్నర గంటల సమయంలో చిరుజల్లు కురిసింది. కానీ, సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం దంచికొట్టడంతో నిత్యం రద్దీగా ఉండే లక్డీకపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, ఎస్ఆర్ నగర్, బోరబండ, సికిందరాబాద్, చార్మినార్, దోమల్‌గూడ, నారాయణగూడ, ఉప్పల్, అంబర్ పేట, రాజేంద్రనగర్, మణికొండ, రాయదుర్గం, శంషాబాద్, కాచిగూడ, హిమయత్ నగర్ ప్రాంతాలతో గాలిదుమారం తో వర్షం కురిసింది. వీటితో పాటు ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలీ, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లలో దాదాపు గంట సేపు కుండపోత వర్షం కురిసింది. చాలా ప్ర్రాంతాల్లో మెయిన్ రోడ్లపై వర్షపు నీరు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి. మణికొండ, మాదాపూర్, అమీర్ పేట, బోరబండ ప్రాంతాల్లోని పలు భవనాల సెల్లార్లలోకి వర్షపు నీరు ప్రవహించింది. పలుచోట్ల పార్కింగ్ చేసిన వాహనాలు నీటమునిగాయి. ఖైరతాబాద్, అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. మెహిదీపట్నం నుంచి లింగంపల్లి వరకు, సికిందరాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తెలుగు తల్లి, ఖైరతాబాద్, బేగంపేట, మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్లపై వాహనాలు ఎక్కడికక్కడే జామ్ అయ్యాయి.
బయటకు రావొద్దు: బల్దియా కమిషనర్
గురువారం రాత్రి నుంచి రెండు రోజుల పాటు నగరానికి వర్షసూచన ఉండటంతో అత్యవసరమైతే తప్ప నగరవాసులు బయటకు రావద్దని బల్దియా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. జీహెచ్ఎంసీ కొత్తగా నియమించుకున్న నిపుణుల హెచ్చరికలు పారదర్శకంగా ఉన్నాయని, వాటినే హైడ్రాకు పంపి, హైడ్రా ద్వారా నగరవాసులకు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆయన వివరించారు. వర్షం సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ బృందాలు హైడ్రా బృందాలను సమన్వయం చేసుకుని సమష్టిగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.