National Film awards: గతేడాది వచ్చిన ‘ఆడు జీవితం’ (The Goat Life) చిత్రం.. సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన పృథ్విరాజ్ సుకుమారన్ తన అద్భుతమైన నటనతో ఆకటుకున్నాడు. అటు దర్శకుడిగా బ్లెస్సీ (Blessy) మంచి ప్రతిభ కనరబరచడంతో ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ రావడం పక్కా అని అంతా భావించారు. అయితే ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ సినిమాకు ఒక్క పురస్కారం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బ్లెస్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ ఏమన్నారంటే?
నేషనల్ అవార్డ్ జ్యూరీ ఛైర్మన్ అశుతోష్ గోవారికర్ గతంలో ‘ఆడు జీవితం’ సినిమా చూసి ప్రశంసించారని దర్శకుడు బ్లెస్సీ అన్నారు. ఇప్పుడు జాతీయ అవార్డుల విషయంలో నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అప్పుడు ”ఆడుజీవితం’ను ప్రశంసించి.. ఇప్పుడు సాంకేతిక లోపాలను చూపిస్తూ తిరస్కరించడం తగదని పేర్కొన్నారు. ముంబైలో ఆస్కార్ ప్రచారం సమయంలో చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు గోవారికర్ మాట్లాడుతూ ‘ఇది లారెన్స్ ఆఫ్ అరేబియా (1962) తరహాలో ఉందని అప్పటి నుండి ఇంత అందంగా ఎడారి చూపిన సినిమా చూడలేదని’ అన్నారని గుర్తు చేశారు. ‘ఒకరు ఇంతగా సినిమా వివరాలను ప్రశంసించిన తర్వాత సాంకేతిక కారణాలతో దాన్ని తిరస్కరించడం డబుల్ స్టాండర్డ్స్ లాంటిదే’ అని డైరెక్టర్ బ్లెస్సీ మండిపడ్డారు. అప్పట్లో గోవారికర్ తనను భోజనానికి ఆహ్వానించారని కానీ కొన్ని పనుల కారణంగా వెళ్లలేకపోయానని తెలిపారు.
Also Read: Actress Urvashi: ‘ఉత్తమ నటి కావాలంటే.. యంగ్‌గా ఉండాలేమో’.. నటి షాకింగ్ కామెంట్స్!
జ్యూరీ సభ్యుడు వాదన ఇదే!
ఇదిలా ఉంటే ఆడు జీవితంపై జ్యూరీ ఛైర్మన్ అశుతోష్ గోవారికర్ కు ఉన్న అనుమానాలను మరో సభ్యుడు ప్రదీప్ నయార్ పంచుకున్నారు. గోవారికర్ ఈ చిత్రాన్ని గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ముందే చూశారని స్పష్టం చేశారు. ఈ సినిమా అడాప్టేషన్, ఎగ్జిక్యూషన్‌పై తీవ్రమైన అనుమానాలను ఆయన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అడాప్టేషన్ సహజంగా లేకపోవడం, నటనల్లో నిజమైన భావాలు రాకపోవడం వంటి కారణాలతో అవార్డుల చర్చ నుంచి చిత్రం తప్పుకుందని స్పష్టం చేశారు. అంతేకాదు చిత్ర నిర్మాతలు పాటల కోసం సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని అందించలేకపోవడం వల్ల ఉత్తమ గాయకుడు, ఉత్తమ సంగీతం విభాగాల్లోనూ అవార్డును కోల్పోయారని చెప్పారు. కథానాయకుడి నటనను జ్యూరీ సభ్యులు మెుత్తం ప్రశంసించినప్పటికీ చిత్రం నాణ్యత విషయంలో ఉన్న లోపాల కారణంగా అవార్డు రాలేదని అన్నారు.