Revanth Reddy:
* పాక్‌తో యుద్ధం విషయంలో మేం సహకరించాం
* కానీ, మోదీ మాత్రం చెప్పా పెట్టకుండా ఆపేశారు
* దేశ భద్రత, విదేశీ వ్యవహారాల్లో మోదీ ఫెయిల్
* ట్రంప్ సూచనల మేరకు దేశాన్ని నడుపుతున్నారు
* ఏబీవీపీలో పని చేశా.. కానీ బీజేపీని వ్యతిరేకించా
* రాహుల్ గాంధీ నుంచి ఎంతో నేర్చుకున్నా
* ఆయన విజన్ ఉన్న నాయకుడు
* కులగణన అనేది మెగా హెల్త్ చెకప్
* మేం చేసి చూపించాక కేంద్రం చేయాల్సి వచ్చింది
* కుల సర్వే, జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ లాంటివి
* తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకెళ్తున్నాం
* ‘ది ప్రింట్ ఇండియా’ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, స్వేచ్ఛ: ఆపరేషన్ సింధూర్‌ను ముగించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు మోదీ వ్యవహరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇది అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అని అభివర్ణించారు. ‘ది ప్రింట్ ఇండియా’ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం దేశ భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఈ రెండు విషయాల్లో విఫలమయ్యారని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడంలోనూ ఫెయిల్ అంటూ విమర్శించారు. ట్రంప్ తీరు ఏం జరిగినా తన వల్లే అన్నట్టుగా ఉందని అన్నారు.
పాక్‌పై దాడులు సడెన్‌గా ఎందుకు ఆపారు?
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాతి పరిణామాలపై మాట్లాడిన రేవంత్, హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి తాను ర్యాలీ తీసినట్టు గుర్తు చేశారు. పాకిస్థాన్‌పై యుద్ధం విషయంలో తమ పూర్తి మద్దతు ఇచ్చామన్నారు. కానీ, ఆపరేషన్ సింధూర్‌ను ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏకాభిప్రాయంతో అకస్మాత్తుగా నిలిపివేశారని, పైగా దీన్ని ట్రంప్ ప్రకటించారని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ట్రంప్ సూచనల ప్రకారం మోదీ దేశాన్ని నడుపుతున్నట్టు అర్థం అవుతుందని అన్నారు. అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల్లో మోదీ 200 శాతం విఫలమయ్యారని విమర్శించారు. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు.
బడేభాయ్ వ్యాఖ్యలపై క్లారిటీ
రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తల్లో ప్రధాని మోదీతో కలిసి ఓ సభలో మాట్లాడుతూ, ఆయన్ను బడే భాయ్ అని సంబోధించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా తాజా ఇంటర్వ్యూలో మరోమారు క్లారిటీ ఇచ్చారు. దేశంలోని ప్రతి ముఖ్యమంత్రికి ప్రధాని అన్నయ్యేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, తాను అలా గౌరవాన్ని ఇస్తానని చెప్పారు. మోదీ తనను తమ్ముడిగా భావిస్తే రాష్ట్రానికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ, కాంగ్రెస్ ప్రయాణంపై..
టీడీపీలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నానని రేవంత్ అన్నారు. ఆయన ప్రగతిశీల ఆలోచన, పరిపాలనా నైపుణ్యాలు, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో ఎలా పని చేయాలో తెలుసుకున్నానని, కాంగ్రెస్‌లోకి వచ్చాక రాహుల్ గాంధీ నుంచి చాలా నేర్చుకున్నానని వివరించారు. రాజకీయాల్లో ఎవరైనా ప్రజా ప్రతినిధి కావొచ్చు కానీ నాయకత్వ లక్షణాలు చాలా అవసరమని అన్నారు.
Read Also- Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..
ఏబీవీపీలో పని చేశా.. కానీ
కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో పని చేసిన అనుభవాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏబీవీపీ అనేది బీజేపీ కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. ఒకనాడు ఏబీవీపీ కార్యకర్తలుగా తనతోపాటు చాలామంది బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్లమని చెప్పారు. చాలా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేశామని తెలిపారు. తాను ఏబీవీపీతో అనుబంధాన్ని అంగీకరిస్తాను కానీ బీజేపీతో కాదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం
రాహుల్ గాంధీకి ఓ విజన్ ఉందని, అణగారిన వర్గాల పట్ల అవగాహన ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లగల దృఢమైన నాయకత్వం ఆయన సొంతమని చెప్పారు. ఆ నిబద్ధతను చూశాక, తాను రాహుల్ గాంధీతో పని చేయాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌లోకి వచ్చానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాహుల్ ఓ సిద్ధాంతంతో పని చేస్తున్నారని, తన విధులను సరిగ్గా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. తాను కూడా అదే ఫాలో అవుతున్నానని, ప్రజల పట్ల, వారి సంక్షేమం పట్ల బాధ్యతగా పని చేస్తున్నానని వివరించారు.
Read Also- Metro: ఓల్డ్ సిటీ మెట్రో పనులు ఎక్కడ వరకు వచ్చాయంటే?
కులగణన అనేది మెగా హెల్త్ చెకప్
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనను ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ‘‘కులగణన అనేది సమాజం ఎక్స్‌రే అని రాహుల్ గాంధీ అంటున్నారని, నేను దానిని మెగా హెల్త్ చెకప్ అని పిలుస్తాను. తెలంగాణలో చేసిన సర్వే కేవలం కోటా గురించి కాదు. ఇది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే. కులం అనేది చివరి స్థానంలో ఉంటుంది’’ అని అన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కుల సర్వేలు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘‘తెలంగాణలో జరిపిన కులగణన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 2026లో జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని నిర్ణయించింది. కేంద్రమే చేస్తున్నప్పుడు, రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది. కుల సర్వే, జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా గేమ్ ఛేంజర్‌గా మారతాయి’’ అని అన్నారు.
తెలంగాణ రైజింగ్
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని సీఎం తెలిపారు. మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోందని అన్నారు. సమగ్ర అబివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల కోసం సీఎంవోలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్ నుంచి వస్తున్నదని, కాబట్టి నగరాన్నిమరింత అభివృద్ధి చేసేందుకు ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించేది లేదని స్పష్టం చేశారు.