Hero Krishnasai: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినిమా వాళ్లను ఉద్దేశించి, ఇకపై థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుకోవాలన్నా, లేదంటే ఎక్స్‌ట్రా షోలు కావాలన్నా కచ్చితంగా డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలు పెంచుకునే క్రమంలో కొందరు హీరోలు ఆ మధ్య వీడియోలు కంటిన్యూగా చేశారు. కానీ, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచుకోవడం, ప్రీమియర్ షోలు వంటివి బంద్ అయ్యాయి. అప్పటి నుంచి హీరోలు కూడా డ్రగ్స్ అవగాహన విషయంలో సీఎం చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సూచనను తూచా తప్పకుండా పాటిస్తున్నారు హీరో కృష్ణ సాయి. డ్రగ్స్‌పై యువతకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు హీరో కృష్ణసాయి స్పందించి, పలు ప్రచార చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియో మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
Also Read- Satyadev: మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు కదా! అలాగే?
ప్రస్తుతం విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుకుంటున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తుండటం చూస్తుంటే వారి భవిష్యత్ ఎటువైపు వెళుతుందనేది అర్థం కావడం లేదు. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్‌కి బానిసై.. భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకుపోయి భవిష్యత్ లేకుండా చేసుకుంటున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే స్థాయికి దిగజారి పోతున్నారు. అదేంటని ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుని మరీ దాడులు చేస్తున్నారు. మత్తుకు బానిసై ముఠాలుగా ఏర్పడి విక్రయాలు సైతం జరుపుతున్నారు. అదే మత్తులో హత్యలు, అత్యాచారాల వంటి అరాచకాలు ఎన్నో ఎన్నెన్నో. యువత, విద్యార్థులపై అంతటి ప్రభావాన్ని చూపిస్తున్న అలాంటి డ్రగ్స్‌ను అరికట్టేందుకు తనవంతు బాధ్యతగా హీరో కృష్ణసాయి ప్రచార చిత్రాలతో ముందుకు వస్తున్నారు.
Also Read- Allu Aravind: ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నా!
‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ సందేశంతో నిండిన వీడియో విడుదల సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో హీరో కృష్ణసాయి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొందించడం జరిగింది. గవర్నర్లు, పోలీస్ విభాగంతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గీతంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సినిమాకి ముందు ‘స్మోకింగ్ డేంజర్’ అని హెచ్చరికలు చేసే మెసేజ్ వలన యువతలో అవగాహన ఏర్పడి, చాలా వరకు సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం తగ్గిపోయింది. సినిమా మాధ్యమం వల్ల ప్రజలు ప్రభావితం అవుతారనేది తెలియంది కాదు. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు మేము రూపొందించిన పాట ‘డేంజర్’ అనే సినిమాలో ఉంటుంది. ఈ సినిమా యువతను మార్పు దిశగా నడిపిస్తుందనే నమ్మకం మా టీమ్ అందరిలో ఉందని అన్నారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాలు, ఉద్యమాలు ముందుకు వెళ్లాలంటే మీడియా మద్దతుతో పాటు, ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆయన కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు