Indian Sperm Tech Center: ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్‌లో అధికారులు మరోసారి తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో నిల్వ చేసి ఉన్న స్పెర్మ్ శాంపిళ్లను సీజ్ చేశారు. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్(Secunderabad)రెజిమెంటల్ బజార్‌లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్‌పై ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిని నడుపుతున్న పంకజ్ సోనీ అనే వ్యక్తితోపాటు మరో ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వైద్య, రెవెన్యూ అధికారులతోపాటు క్లూస్ టీం సిబ్బందితో కలిసి పోలీసులు మరోసారి ఈ సెంటర్‌లో సోదాలు చేశారు. ఈ క్రమంలో పలువురి నుంచి సేకరించి కంటెయినర్లు, ఫ్రిడ్జిల్లో భద్రపరిచిన వీర్యం శాంపిళ్లను సీజ్ చేశారు. కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
Also Read: Gurukul Seats: ర్యాంకులు లేకున్నా రికమెండేషన్‌లు.. ఎంపీల పేర్లతో అత్యధిక పైరవీలు
ఏజెంట్లతో నెట్‌వర్క్
ఇప్పటి వరకు జరిపిన విచారణలో పంకజ్ సోనీ ఏజెంట్లను పెట్టుకుని ఈ కార్యకలాపాలను నడిపిస్తూ వచ్చినట్టుగా వెల్లడైంది. నిబంధనల ప్రకారం 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారి నుంచి వీర్యం సేకరించాల్సి ఉంటుంది. దీనికి ముందు దాతలకు ఎలాంటి జన్యు వ్యాధులు, ఇతర రోగాలు లేవని పరీక్షలు జరిపి నిర్ధారించుకోవాలి. ఎయిడ్స్ పరీక్షలు జరపాలి. ఇక, సేకరించిన వీర్యాన్ని ఆరు నెలల పాటు భద్రపర్చాలి. ఆ తరువాత మరోసారి దానిని పరీక్ష చేసి అంతా సవ్యంగా ఉందనుకుంటేనే సరోగసీకి ఒప్పుకున్న మహిళకు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాహకుడైన పంకజ్ సోనీ ఈ నిబంధనలు ఏవీ పాటించ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని విద్యార్థులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ హాస్టళ్లలో ఉంటున్న యువకుల నుంచి వీర్యాన్ని సేకరిస్తూ వచ్చినట్టుగా వెల్లడైంది. ఇలా వీర్యం ఇచ్చిన వారికి వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతోపాటు కొంతమంది మహిళలను కూడా ఏజెంట్ల ద్వారా పిలిపించుకుని వారి అండాలు సేకరించినట్టుగా వెల్లడైంది.
ఇలా అండాలు దానం చేసిన వారికి 10 నుంచి 20వేలు ఇచ్చినట్టుగా తేలింది. ఇలా సేకరించిన వీర్యం, అండాల శాంపిళ్లను కంటెయినర్లలో భద్రపరిచి గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని వేర్వేరు సంతాన సాఫల్య కేంద్రాలకు పంపిస్తున్నట్టుగా వెల్లడైంది. దీనిపై పోలీసులతో మాట్లాడగా నిందితులను త్వరలోనే కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోనున్నట్టు చెప్పారు. వారిని క్షుణ్ణంగా విచారిస్తేనే ఏయే టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు వీర్యం, అండాలను సరఫరా చేశారు? అన్న వివరాలు తెలుస్తాయన్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇండియన్ స్మెర్మ్ టెక్ నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు వీర్యం, అండాల శాంపిళ్లు సరఫరా అయినట్టుగా వెల్లడి కాలేదన్నారు.
Also Read: Kavitha: బీసీల కోసం ఆగస్టు 4 నుంచి 7వరకు దీక్ష చేస్తా