Satyadev: టాలీవుడ్‌లోని టాలెంటెడ్ హీరోలలో సత్యదేవ్ ఒకరు. విలక్షణ పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). ఎమోషన్స్‌తో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు నేతృత్వంలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. వి.వి. సూర్య కుమార్ దర్శకత్వంలో వహించిన ఈ ‘అరేబియా కడలి’ సిరీస్‌లో సత్యదేవ్ సరసన ఆనంది నటించగా.. నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరాం, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారి, నిహార్ పాండ్యా, ఆలొక్ జైన్ వంటి వారంతా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో, తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. భారతదేశంతో పాటు 240కి పైగా దేశాలు, వివిధ ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోను ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది.
Also Read- Kaantha Teaser: అన్నట్టు, సినిమా పేరు ‘శాంత’ కాదు.. ‘కాంత’! ఆడియెన్స్‌కి ఇదే నచ్చుతుంది
‘అరేబియా కడలి’ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఈ కల్పిత కథానికలో ప్రత్యర్థి గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటనను హృదయానికి తాకేలా ఈ ‘అరేబియా కడలి’ని చిత్రీకరించారు. ఈ కథలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. బదిరి, అతని సహచర మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీ జీవితం, అలాగే వ్యవస్థను ఎదిరించే ధైర్యవంతమైన మహిళగా గంగా ఎదుగుదల. ఈ ప్రయాణాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఏర్పడే స్నేహాం, సంబంధాలు.. శక్తివంతమైన శత్రువులను ఎదుర్కొనే స్థాయిలో ఉంటుంది. అరేబియా కడలి అనేది సహనానికి, విపత్తులో పుట్టిన సోదరతత్వానికి, స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి అంకితమైన కథ. సరిహద్దులతో విభజించబడిన ప్రపంచంలో, ఈ సిరీస్ మానవత్వం సహజమని గుర్తు చేస్తుంది.
Also Read- War2: ట్రైలర్‌లో స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వకూడదనే ఐడియా ఎవరిదో తెలుసా?
ఇదంతా చదువుతుంటే ఈ కథని ఎక్కడో విన్నట్టు, చూసినట్లు అనిపిస్తుంది కదా. గుర్తుకు వస్తే ఓకే, గుర్తుకు రానివారికి మాత్రం ఇది ‘తండేల్’ కథలా అనిపిస్తుంది కదా. అవును, దాదాపు ‘తండేల్’ తరహాలో జరిగే కథే. ఇంకా చెప్పాలంటే ఆ కథకి స్ఫూర్తినిచ్చిన ఒరిజినల్ కథ ఇదని చెప్పుకోవచ్చు. ‘అరేబియా కడలి’ అనేది అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ధైర్యాన్ని, సహనాన్ని ప్రశంసించే తెలుగు డ్రామా అని అంటున్నారు ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మాధోక్. ‘ఈ సిరీస్ అనేక మానవీయ భావాలను, అవిశ్వాసం, ఐక్యత, గర్వం, బతకాలన్న తపన వంటి వాటిని ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది. సత్యదేవ్, ఆనంది అద్భుతమైన నటనతో ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేకతని తీసుకొచ్చారు. ‘అరేబియా కడలి’ మా తెలుగు ఒరిజినల్స్ శ్రేణిలో ఒక శక్తివంతమైన సిరీస్ అని చెప్పగలను. ఆగస్టు 8న ఈ కథను మా వీక్షకులకు అందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. ‘అరేబియా కడలి’ అనేది ధైర్యం, సంకల్పంతో నిండిన హృదయాన్ని హత్తుకునే కథ అని, కచ్చితంగా ఈ సిరీస్ ప్రైమ్ వీక్షకులను మెప్పిస్తుందని నిర్మాత వై. రాజీవ్ రెడ్డి అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు