Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. గ్రాఫిక్స్ విషయంలో కాస్త నిరుత్సాహంగా ఉన్నా పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. సనాతన ధర్మం గురించి సినిమాలో అద్భుతంగా చూపించారు. అయితే, ఈ మూవీపై సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతా ఊహాజనితం
హరిహర వీరమల్లు చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి తీయలేదని, ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారని శ్రీనివాసరావు అన్నారు. కానీ, అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారని చెప్పారు. అపోహలతో కూడిన ఈ ఊహాజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగడానికి దారి తీయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదని వ్యాఖ్యానించారు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ అని పవన్ కళ్యాణ్ ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు.
వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత లేదా?
పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే ఇంకోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. దీని గురించి కూడా ప్రస్తావించిన శ్రీనివాసరావు, బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉండి, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడిగారు. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమేనని అన్నారు. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలని చెప్పారు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడం వల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయని వివరించారు.
Read Also- Junior Movie: జూనియర్ మూవీకి అంత హైప్ ఇచ్చారు.. కలెక్షన్స్ మరి అంత తక్కువ?
కోహినూర్ బ్రిటీష్ వాళ్ల దగ్గర ఉంది
హరిహర వీరమల్లు కథకు ప్రధాన అంశమైన కోహినూర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు శ్రీనివాసరావు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు కాకతీయుల సామ్రాజ్యానికి చేరిందని అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొఘల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్ షా, అటు నుండి ఆఫ్ఘనిస్థాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడి నుండి బ్రిటిష్ వాళ్లకు లభించిందని వివరించారు. వారు దాన్ని లండన్‌కు తరలించారని చెప్పారు. తిరిగి అది భారతదేశానికి రాలేదని, సినిమాలో బ్రిటిష్ వాళ్ల పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయిందని, వారు దేశంలో అంతర్భాగం అయిపోయారని, కానీ బ్రిటిష్ వాళ్ల కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది వివరించారు.
కోహినూర్‌ను తీసుకురావాలి
బ్రిటిష్ వాళ్లు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్లిపోయారని, ఈ చారిత్రక వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించడం అవసరమని శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పవన్ అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారని, గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారని చురకలంటించారు. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.
Read Also- Walking Tips: రోజుకు 7 వేల అడుగులు నడిస్తే ఆరోగ్య అద్భుతాలు!