Mohan Babu: టాలీవుడ్ అగ్ర నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన రోజున హైదరాబాద్‌లో ఉన్న సెలబ్రిటీలెందరో.. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వంటి వారంతా కోట ఇంటికి నివాళులు అర్పించడానికి వచ్చిన వారిలో ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్‌లో లేకపోవడం కారణంగా కోట శ్రీనివాసరావు చివరి చూపుకు నోచుకోలేకపోయానని అన్నారు మంచు మోహన్ బాబు. ఆయన సోమవారం కోట కుటుంబాన్ని పరామర్శించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను, అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం చెందిన రోజున హైదరాబాద్‌లో లేనని, చివరి చూపు చూడలేకపోయినందుకు బాధగా ఉందని, అందుకే ఈ రోజు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు.
Also Read- Manchu Vishnu: ‘కన్నప్ప’ షాకిచ్చినా మంచు విష్ణులో మార్పులేదు.. నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా?
ఈ సందర్భంగా మోహన్ బాబు (Manchu Mohan babu) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఇండస్ట్రీలోని అత్యంత ఆప్తులలో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన అకాల మరణం చెందిన రోజు నేను హైదరాబాద్‌లో లేను. ఆయన మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లుగా భావించాను. ‘కన్నప్ప’ సినిమా రిలీజ్ రోజు నాకు ఫోన్ చేశారు. సినిమా చాలా బాగుంది.. విష్ణుకు మంచి పేరు వస్తోందని నాతో చెప్పారు. ‘కన్నప్ప’ విషయమై ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. 1987 సంవత్సరంలో ‘వీరప్రతాప్’ అనే సినిమాలో మాంత్రికుడుగా, మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో అవకాశం ఇచ్చాను. మా బ్యానర్‌లో, బయట బ్యానర్‌లలో మేము కలిసి చాలా సినిమాలలో పని చేశాం. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటేమిటి.. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడాయన. కోట మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. కోట ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Also Read- Pawan Kalyan: అందుకు నాకు పొగరో, అహంకారమో కారణం కాదు.. ఏంటంటే?
కోట శ్రీనివాసరావు విషయానికి వస్తే.. జూలై 10వ తేదీని పుట్టినరోజు జరుపుకున్న కోట (83).. జూలై 13 (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలా ఉండి కూడా, కొన్ని పాత్రలలో నటించారు. నటిస్తునటిస్తూనే చనిపోవడం కోటకు దక్కిన గొప్ప వరంగా ఇండస్ట్రీ భావిస్తోంది. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ అని తెలుస్తోంది. కోట మృతి పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విషయం తెలియంది కాదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు