ORR:
– పెద్ద పామై మింగేస్తున్న ఓఆర్ఆర్
– సరాసరిన నెలకు నలుగురి మృత్యువాత
– వాహనదారులే కారణమంటున్న అధికారులు
– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు వెల్లడి
– జిగ్ జాగ్‌గా వాహనాలు నడుపుతున్న వారు ఎందరో..
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహానగరానికి మణిహారం లాంటి జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు పెద్ద పాములా మారింది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో నిర్మించిన ఈ రోడ్డుపై నెలకు సరాసరిన 18కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ నాలుగు రోజులకొకరు మృత్యువాత పడుతుండగా రెండు రోజులకొకరు తీవ్ర గాయాలతో ఆసుత్రుల పాలవుతున్నారు. వీరిలో కొందరు శాశ్వత దివ్యాంగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాహనదారుల నిర్లక్ష్యమేనని అధికారులు చెబుతున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపిస్తుండడం, నిబంధనలను ఏమాత్రం పాటించకపోతుండడంతోనే ఓఆర్ఆర్పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
రోడ్డుకు ఇరు వైపులా..
‘స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్’ అని రాసి ఉన్న సైన్ బోర్డులు ఔటర్ రింగు రోడ్డుపై పలు చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అయితే, ముఖ్యంగా కార్లు నడుపుతున్న వారు ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇరు వైపులా నాలుగేసి చొప్పున మొత్తం 8 లేన్లతో ఓఆర్ఆర్ నిర్మించినప్పుడు దీనిపై గరిష్ట వేగం 80 కిలోమీటర్లుగా అధికారులు నిర్ణయించారు. అంతకు మించి వేగంతో వెళితే చర్యలు తీసుకునేవారు. వాహనాల వేగాన్ని గమనించడానికి అప్పట్లో స్పీడ్ గన్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో లేన్‌లో ఎడమ వైపు ఉండే మొదటి రెండు లేన్లను భారీ వాహనాలు, గూడ్స్ లారీలకు కేటాయిస్తే కుడి వైపు ఉండే లేన్ల మీదుగా కార్లు వెళ్లాలి. కొంతకాలం క్రితం అధికారులు స్పీడ్ లిమిట్ నిబంధనను సడలించారు. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పలువురు వాహనదారులు ఓఆర్ఆర్పై పట్టపగ్గాలు లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో రయ్యిమని దూసుకెళుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా గాలితో పోటీ పడుతున్నట్టు వెళుతున్న వారు జిగ్ జాగ్‌గా వాహనాలు నడుపుతుండడం. నిబంధనల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని కుడివైపు నుంచి మాత్రమే ఓవర్ టేక్ చేయాలి. అలా కూడా కుడివైపు ఉన్న ఇండికేటర్‌ను ఆన్ చేసిన తరువాత, ఓఆర్ఆర్పై వాహనాలు నడుపుతున్న వారిలో చాలామంది దీనిని పాటించడం లేదు. ఎటువైపు ఖాళీ కనిపిస్తే అటువైపు నుంచి ముందుకు దూసుకెళుతున్నారు. ఇండికేటర్లు కూడా వేయకుండా సడన్‌గా లేన్లు మారుస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండడంతోపాటు అవతలివారిని మృత్యుముఖంలోకి నెడుతున్నారు.
Read Also- Health News: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా?. కారణం ఇదే!
ఎక్కడబడితే అక్కడే పార్కింగ్
వాహనాలు రిపేరుకు వచ్చినా, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా ఓఆర్ఆర్పై దాని కోసం సౌకర్యాలు ఉన్నాయి. నిర్ణీత దూరానికి ఒకటి చొప్పున బ్రేక్ డౌన్ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ల వద్ద లారీలు మొదలుకుని కార్ల వరకు ఎవరైనా తమ తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. బ్రేక్ డౌన్ పాయింట్ల వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వసతులు కల్పించారు. అయితే, చాలామంది లారీ డ్రైవర్లు తమ తమ లారీలను ఓఆర్ఆర్పై ఎక్కడబడితే అక్కడ రోడ్డుకు ఎడమ వైపు పార్క్ చేస్తున్నారు. ఇలా పార్క్ చేస్తున్న వాహనాలను వెనుక నుంచి వచ్చి ఢీ కొడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
Read Also- Viral News: 9 నెలల్లో మృత్యువు.. విలువైన సలహాలు కోరిన యువతి
స్వీయ నియంత్రణ అవసరం
డ్రైవింగ్‌లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మురళీ అనే వ్యక్తితో ‘స్వేచ్ఛ’ మాట్లాడగా, ఏ కారైనా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటేనే డ్రైవర్ ఆధీనంలో ఉంటుందని చెప్పారు. అంతకు మించి వేగంతో నడిపితే కంట్రోల్లో ఉండదన్నారు. దీనికి కారణం పవర్ స్టీరింగులే అని చెప్పారు. ఓవర్ స్పీడ్‌లో స్టీరింగ్‌ను అర అంగుళం పక్కకు తిప్పినా, దానిపై అర సెకను పాటు అదుపు కోల్పోయినా ఎటో ఒక వైపు దూసుకెళ్లిపోతుందని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పారు. పోలీస్ అధికారులతో మాట్లాడితే, వాహనదారులకు స్వీయ నియంత్రణ అవసరమన్నారు. పరిమితికి మించిన వేగంతో అస్సలు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అప్పుడే కొంతలో కొంత ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.