CID on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో జరిగిన అక్రమాల కేసులో సీఐడీ (CID) అధికారులు స్పీడ్ పెంచారు. ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియంలోని కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ తనిఖీల్లో దొరికిన డాక్యుమెంట్లతోపాటు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెల్లడైన వివరాలను ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. అయితే, చాలా ప్రశ్నలకు జగన్మోహన్ రావు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలినట్టుగా సమాచారం.
స్పీడ్ పెంచిన సీఐడీ
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (Telangana Cricket Association) ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీఏ అక్రమాలపై సీఐడీ (CID) అధికారులు కేసులు నమోదు చేసి జగన్మోహన్ రావుతోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకుని ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నారు. రెండో రోజు దర్యాప్తులో భాగంగా (Jagan Mohan Rao) జగన్మోహన్ రావును హెచ్‌సీఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. మొదట చాలాసేపు తనిఖీలు జరిపి క్రికెట్ బాల్స్, క్లాతింగ్, కుర్చీలు, జిమ్ పరికరాలతోపాటు ఇతర వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి జరిపిన చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు సీజ్ చేశారు. అనంతరం వాటికి సంబంధించి జగన్మోహన్ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది.
Also Read: Masood Azhar: పీవోకేలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్.. పసిగట్టిన ఇంటలిజెన్స్
ప్రశ్నల వర్షం
జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్రికెట్ బాల్స్ కోసం ఇండియానా స్పోర్ట్స్ సంస్థకు కోటి రూపాయలు చెల్లించిన విషయం ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అయితే, ఒక్క క్రికెట్ బాల్ కూడా అసోసియేషన్‌కు రాలేదని వెల్లడైంది. దీనిపై సీఐడీ అధికారులు ప్రశ్నించగా జగన్మోహన్ రావు మౌనంగా ఉండిపోయినట్టుగా సమాచారం. అంతకు ముందు ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ సందర్భంగా ఎల్ఈడీ టీవీల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై కూడా ప్రశ్నించినట్టుగా తెలిసింది. దీనికి కూడా జగన్మోహన్ రావు (Jagan Mohan Rao) సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇక, గడిచిన రెండేళ్లలో క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి వచ్చిన 170 కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చు చేశారు.
ఏయే జిల్లాల క్రికెట్ అసోసియేషన్లకు ఎంతెంత నిధులు కేటాయించారు అని కూడా సీఐడీ అధికారులు అడిగినట్టు తెలిసింది. బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాలు, క్రికెట్ సామగ్రి తదితర కొనుగోళ్లపై కూడా నిశితంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఆటగాళ్లను ఎంపిక చేయడానికి వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై కూడా అడిగినట్టుగా తెలిసింది. అయితే, చాలా ప్రశ్నలకు జగన్మోహన్ రావు నాకు తెలియదు, నేను మరిచిపోయాను అంటూ జవాబులు ఇచ్చినట్టుగా తెలిసింది. టెండర్లు పిలవకుండానే కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని అడిగితే అందరి సభ్యుల ఆమోదంతోనే అదంతా జరిగిందని చెప్పినట్టుగా సమాచారం.
శ్రీచక్ర క్లబ్బుకు..
జగన్మోహన్ రావుతోపాటు ఇదే కేసులో అరెస్టయిన రాజేందర్ యాదవ్, కవితలను సీఐడీ (CID) అధికారులు గౌలిపురాలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్బుకు తీసుకెళ్లనున్నట్టుగా తెలిసింది. మాజీ మంత్రి కృష్ణా యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా జగన్మోహన్ రావుకు ఈ క్రికెట్ క్లబ్బులో సభ్యత్వం ఉన్నట్టుగా ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్టు ఇప్పటికే విచారణలో నిర్ధారణ అయ్యింది. దీనికి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలు సహకరించినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు శ్రీచక్ర క్రికెట్ క్లబ్బులో కూడా తనిఖీలు జరిపి ఈ వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
Also Read: Malnadu Restaurant Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీస్ అధికారుల సుపుత్రులు