Gandhi Nursing Students: గాంధీ నర్సింగ్ స్టూడెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. కష్టపడి చదివి ప్రభుత్వ ( Nursing College) నర్సింగ్ కాలేజీలో సీటు సాధించినప్పటికీ, (Private Hostels) ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన 9 నెలలుగా నర్సింగ్ విద్యార్థులంతా ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటున్నారు. పైగా సొంత డబ్బులు చెల్లించి మరీ ఆయా హాస్టల్స్‌లో స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొందరు విద్యార్థినిలు ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఇదే విషయాన్ని నర్సింగ్ కాలేజీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమస్యపై లేఖ రాస్తామని చెప్తున్నారే తప్ప సీరియస్‌గా తీసుకొని సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేయడం లేదని నర్సింగ్ విద్యార్థినిలు వాపోతున్నారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
సికింద్రాబాద్ (Secunderabad) బన్సీలాల్ పేట్ డివిజన్ న్యూ బోయిగూడలో గాంధీ నర్సింగ్ కాలేజీకి (Gandhi Nursing College) ప్రభుత్వం హాస్టల్ సౌకర్యం కల్పించింది. అయితే, ఇక్కడ నిత్యం డ్రైనేజీ వ్యవస్థ బ్లాక్ అవుతున్నది. ఏళ్ల తరబడి నుంచి ఇదే సమస్య ఉన్నది. డ్రైనేజీలు బ్లాక్ అయినప్పుడు మొక్కుబడిగా తాత్కాలిక మరమ్మతులు చేయించి నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిష్కారం చూపడం లేదు. 9 నెలల కిందట మళ్లీ డ్రైనేజీ సిస్టం బ్లాక్ అయింది. దీంతో నర్సింగ్ స్టూడెంట్లంతా ఆందోళనకు దిగగా, రిపేర్లు అయ్యేంత వరకు బయట హాస్టల్స్‌లో ఉండాలని అక్కడి అధికారులు సూచించినట్లు సమాచారం. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో విద్యార్ధులంతా , (Private Hostels) ప్రైవేట్ హాస్టళ్లకు వెళ్లిపోయారు. కానీ, 9 నెలలు గడుస్తున్నా పరిష్కారం చూపించకపోవడం విచిత్రంగా ఉన్నదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రభుత్వ సలహాదారుకూ వినతి
గాంధీ నర్సింగ్ హాస్టల్‌కు సంబంధించిన సమస్యపై ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా వినతి పత్రం అందజేశారు. కానీ, ఎలాంటి పరిష్కారం కాలేదని విద్యార్ధులు చెప్తున్నారు. కనీసం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. బోయిగూడలోని నర్సింగ్ కాలేజీలో అన్ని క్లాస్‌లు కలిపి సుమారు 200 మంది నర్సింగ్ స్టూడెంట్లు ఉంటారు. ఇందులో 27 మంది మినహా మిగతా వారంతా ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటున్నట్లు సమాచారం.
ఆ 27 మంది జమ్ము కాశ్మీర్‌కు చెందిన వారు కావడంతో వారికు ప్రైవేట్ హాస్టల్స్‌లో అవకాశం ఇవ్వడం లేదట. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వం సమకూర్చిన హాస్టల్స్‌లోనే ఉంటూ ఫ్యాకల్టీ వాష్ రూమ్స్ వినియోగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. తాము చదివే సమయంలోనూ డ్రైనేజీ, సెక్యూరిటీ సమస్యలు ఉండేవని నర్సింగ్ పూర్వ విద్యార్ధి ఒకరు తెలిపారు. వీటితో పాటు మెస్‌లో ఆహారం సరిగ్గా లేక అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక రైల్వేస్టేషన్ అతి దగ్గరగా ఉండడంతో కొంతమంది ఆకతాయిలతోనూ సమస్యలు ఉండేవని పూర్వ విద్యార్ధి ఒకరు వివరించారు.
రెస్పాన్స్ ఎవరు?
గాంధీ నర్సింగ్ కాలేజీలో (Gandhi Nursing College) చదివే విద్యార్ధినిలలో 88 శాతం మంది ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉండటం గమనార్హం. ప్రభుత్వ కాలేజీల్లో సీటు సాధించిన తర్వాత కూడా సొంత డబ్బులతో వీళ్లు ప్రైవేట్ హాస్టల్స్‌కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే సమయంలో ఆయా విద్యార్ధులకు రక్షణ పరిస్థితి కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఏదైనా ఇష్యూ జరిగితే రెస్సాన్స్ ఎవరనేది కూడా ఇక్కడ సస్పెన్స్‌గా మారింది. నర్సింగ్ కాలేజీ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Bhadradri Kothagudem: అరుదైన డెలివరీ.. రికార్డ్ సృష్టించిన వైద్యులు..