Gram Panchayat: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 52 వేల మందిపైగా మల్టీ పర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి వేతన చెల్లింపుల్లో అవకతవకలు జరుగకుండా అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. నకిలీ క్లెయిమ్‌లు, అనధికార నియామకాలు, ఆర్థిక నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని డీపీఓలకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం మల్టిపర్సస్ వర్కర్లకు ఎస్ఎఫ్సీ ద్వారా టీజీ– బీపాస్ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు.
Also Read: Jurala Project: జూరాలకు పెరిగిన వరద ప్రవాహం.. 18 గేట్లు ఎత్తివేత
కొన్ని పంచాయతీలు తమ సొంత నిధులతోపాటు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ నుంచి రెండుసార్లు చెల్లిస్తున్నాయి. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా నకిలీ చెల్లింపులకు పాల్పడుతున్నాయి. అదనపు పారిశుధ్య కార్మికులను నియమించుకోవడం, వేతనేతర ఖర్చులను కూడా జీతాల కింద క్లెయిమ్ చేస్తున్నాయని పంచాయతీరాజ్‌శాఖ (Panchayat Raj Department) దృష్టికి వచ్చింది. దీంతో ఈ విధానానికి పెట్టేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్థిక నిబంధనలు పాటించడంతోపాటు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన డీపీఓలను ఆదేశించారు. కేంద్రీకృత చెల్లింపు విధానం, ఈ-పంచాయతీ పోర్టల్ ద్వారా డేటా నమోదు చేయడంతో అవకతవకలను అరికట్టవచ్చని తెలిపారు.
నిబంధనలు తప్పనిసరి
గ్రామ పంచాయతీలు ఈ-పంచాయతీ పోర్టల్‌లో మల్టీపర్పస్ వర్కర్ల వివరాలను నమోదు చేశాయి. జిల్లా వారీగా వర్కర్ల సంఖ్యను అదే విధంగా కొనసాగించాల్సి ఉంటుంది. కొత్తవారిని తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అదే విధంగా మల్టీపర్పస్ వర్కర్ మరణించినా, రాజీనామా చేసిన, ఇతర కారణాలతో ఆ స్థానం ఖాళీ అయితే భర్తీ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాతే మల్టీపర్పస్ వర్కర్ ను నియమించుకోవాలి. దీనిని మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓలు) ధృవీకరించాలి.
ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పారిశుధ్య పనులు చేపట్టడానికి అవసరమైన కార్మికుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంపీఓలు, డీఎల్పీఓల ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదనలను పంపాలి. ఎంపీడబ్ల్యూల భర్తీ వివరాలను ఎంపీఓ నమోదు చేస్తే డీఎల్పీఓ ద్వారా ధ్రువీకరించాలి. డీపీఓ ఈ-పంచాయతీ పోర్టల్ లాగిన్‌లో నిర్ధారించాలి. కేంద్రీకృత విధానంలో టీజీ– బీ పాస్ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించనున్నారు. ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా చెక్కలు జనరేట్ చేయడాన్ని నిషేధించారు. కార్యదర్శులు ప్రతీనెలా మల్టీపర్పస్ వర్కర్ల సంఖ్య, వేతన వివరాలను ఈ-పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయాలి. దీనిని డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు తమ స్థాయిలో పర్యవేక్షించాలి. ట్రెజరీ మల్టీపర్పస్ వర్కర్ల వేతన బిల్లులను స్వీకరించదు. ఇక మీదట అన్ని చెల్లింపులు కేంద్రీకృత విధానంతోనే జరగనున్నాయని డైరెక్టర్ సృజన ( Srujana) తెలిపారు.
Also Read: Hyderabad Heavy Rains: నగరంలో భారీ వర్షం .. ట్రాఫిక్‌తో వాహనదారుల ఇక్కట్లు