ACB Arrests: ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా కొందరు అధికారులు తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఏమాత్రం భయం లేకుండా ఆమ్యామ్యాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌గా పని చేస్తున్న కనకరత్నం (Kanakratnam) తన శాఖలోనే డీఈగా పని చేస్తున్న అధికారి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
Also Read: ACB Raids: ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ మెరుపుదాడులు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు.. కారణమిదే!
అధికారి నుంచే లంచం
తాండూరులో పని చేస్తున్న పంచాయితీ రాజ్ డీఈకి ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అయితే, తనను మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారని, దానిని మార్చాలని సదరు డీఈ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ (Kanakratnam) కనకరత్నంను సంప్రదించాడు. ఆ పని చేసి పెట్టడానికి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. బతిమాలిన తరువాత 50 వేల రూపాయలు ఇస్తే పని చేస్తానని చెప్పాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు ఉప్పందింది.
కనకరత్నం (Kanakratnam) లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకోవడానికి వల పన్నారు. ఈ క్రమంలో కనకరత్నం (Kanakratnam) తన ఆఫీస్‌లో డీఈ నుంచి 50 వేల రూపాయలను లంచంగా తీసుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. అతడి నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్ట్ జరుపగా కనకరత్నం లంచం తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏసీబీ (ACB) అధికారులు తన కార్యాలయంలో మూడు గంటలకు పైగా సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
కనకరత్నం మామూలోడు కాదు!
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కనకరత్నం పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకుని ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతోపాటు అతని బంధుమిత్రుల ఇళ్లల్లో తనిఖీలు జరపాలని నిర్ణయించినట్టుగా సమాచారం.
ఇప్పటికే రెండు సార్లు రిటైరై..
ఇప్పటికే రెండు సార్లు రిటైరైన కనకరత్నం, (Kanakratnam) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం ద్వారా తిరిగి అదే పోస్టులో కొనసాగుతుండడం గమనార్హం. ఇటీవలే రిటైర్ అవ్వగా ప్రభుత్వం ఏడాదిపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రిటైరైనా రెండుసార్లు ఎలా ఎక్స్‌టెన్షన్ పొందగలిగాడు, ఆయనకు సహకరించిన అధికారులు ఎవరు అనే కోణంలో కూడా ఏసీబీ (ACB) అధికారులు విచారణ చేయనున్నట్టుగా తెలిసింది. కనకరత్నం (Kanakratnam) మామూలోడు కాదని, పంచాయతీ రాజ్ శాఖను భ్రష్టు పట్టించాడని, అతని ఆగడాలు తట్టుకోలేక బాధితులు పట్టించినట్టు తెలుస్తున్నది. ఇలాంటి అవినీతి తిమింగలాలు ప్రభుత్వ శాఖల్లో ఇంకా చాలామందే ఉన్నారని, ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వ పరువు తీస్తూనే ఉంటారని పలువురు హెచ్చరిస్తున్నారు.
Also Read: KTR Responds to ACB Notice: ఏసీబీ నోటీసుపై కేటీఆర్ లేఖ.. సుప్రీం కోర్టు ఇదే చెప్పిందని వెల్లడి!