Medical College Vacancies: మెడికల్ కాలేజీల్లోని ప్రోఫెసర్ల భర్తీపై సర్కార్ తర్జన భర్జన పడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ని వెకెన్సీలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా అసోసియేట్ ప్రోఫెసర్లను ప్రమోట్ చేయాల్సి ఉన్నది. అసోసియేట్ నుంచి ప్రోఫెసర్ గా ప్రమోషన్ కల్పించి, ఖాళీలను భర్తీ చేయవచ్చని సర్కార్ భావిస్తున్నది. కానీ తమకు ప్రమోషన్లు ఇచ్చినా సిటీలోనే పోస్టింగ్ లు కావాలంటూ అసోసియేట్ ప్రోఫెసర్లలో కొందరు పట్టుబడుతున్నారట. ఇటీవల 278 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డాక్టర్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాసెస్ హోల్డ్‌లో పడింది. ఇక మరి కొన్ని డాక్టర్ల యూనియన్లు మాత్రం ఫస్ట్ రూరల్ ప్రాంతాల్లో పనిచేసే ప్రోఫెసర్లను సిటీకి తీసుకువచ్చి, ఆ తర్వాతనే కొత్త ప్రమోషన్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి.ఆ తర్వాత అన్ని వెకెన్సీలను చూపిస్తూ ప్రోఫెసర్లను భర్తీ చేయవచ్చని చెప్తున్నారు.
ఏళ్ల తరబడి ఒకే దవాఖానలో
దీని వలన జూనియర్లు , సీనియర్ ప్రోఫెసర్లకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ డాక్టర్ల వైద్య సంఘాలు చెప్తున్నాయి. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(Telangana Government Medical Association) అధ్యక్షుడు నరహరి, జనరల్ సెక్రటరీ లాలూ, టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ బొల్లేపాక, జనరల్ సెక్రటరీ డాక్టర్ కిరణ్ మాదాల, ఇతర డాక్టర్లు బొంగు రమేష్, పల్లం ప్రవీణ్, రఘు, శేఖర్ లతో పాటు మరో వంద మంది వైద్యులు డీఎంఈ నరేంద్రకుమార్ ను ప్రత్యేకంగా కలిశారు. ఏళ్ల తరబడి ఒకే దవాఖానలో పనిచేస్తున్న వాళ్లను వెంటనే బదిలీ చేయాలని కోరారు. పెరిఫెరల్ సంస్థల్లో ఫ్యాకల్టీకి ఇన్సెంటివ్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీని వలన వైద్య విభాగంలోని టీచింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.ప్రస్తుతం హైదరాబాద్ పోస్టింగ్ లు చూపించడం లేదనేది డాక్టర్ల సంఘాల వాదన. ప్రభుత్వంతో చర్చింని నిర్ణయం ప్రకటిస్తానని డీఎంఈ హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్(Government Doctors Association) సభ్యులు తెలిపారు.
రెండు సెక్టార్లుగా డాక్టర్లు
అసోసియేట్ ప్రొఫెసర్లను.. ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేయకుండా అడ్డుకునే కుట్ర జరుగుతుందంటూ కొందరు డాక్టర్లు చెప్తుండగా, సీనియర్లు, జూనియర్లుకు సరిసమానంగా న్యాయం జరుగుతుందని మరో కొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. గతేడాది జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో గాంధీ, ఉస్మానియా నుంచి జిల్లాల్లోని కాలేజీల్లోకి బదిలీ అయినోళ్లు మళ్లీ గాంధీ(Gandhi), ఉస్మానియా(OU)లో తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొందరు అసోసియేట్ ప్రోఫెసర్లు చెప్తున్నారు. ఏడాది కూడా పనిచేయకుండా మళ్లీ ప్రయత్నాలు చేయడం ఏమిటని? అసోసియేట్ ప్రోఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో తమకు ప్రమోషన్లు ఇవ్వాలనుకుంటే తొలుత తమను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాల్లోనే ఉంచాలని మరి కొందరు అసోసియేట్ ప్రోఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు .
Also Read: Gadwal Hospitals: ఆసుపత్రి నిర్మాణం పూర్తి.. సేవలు మాత్రం శూన్యం..
నేషనల్ మెడికల్ కమిషన్ కోతలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తుండగా, ప్రమోషన్ల తర్వాత జిల్లాల్లో ఉన్న కాలేజీల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రమోషన్లు వద్దని చెప్తున్నట్లు అసోసియేట్ ప్రోఫెసర్లు వివరిస్తున్నారు. అందరికీ హైదరాబాద్(Hyderabad)లోనే పోస్టింగ్ ఇస్తే, జిల్లాల్లోని కాలేజీల్లో ఎవరు పనిచేస్తారు? అందుకే తొలుత జిల్లాల్లోని కాలేజీల్లో(Collage) పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇలా రెండు వేర్వేరు రాకాల అభిప్రాయాలతో తుది నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ తలకమునకలు అవుతున్నది. మరోవైపు గాంధీ, ఉస్మానియాలో సరిపడా ఫాకల్టీ లేరని, అందువల్ల గాంధీ, ఉస్మానియాలో ఎంబీబీఎస్(MBBS), పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ కోతలు పెడుతుందని కొందరు అసోసియేట్, ప్రోఫెసర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు సర్కార్ వాపోతున్నది. గత ఏడాది జనరల్ ట్రాన్స్ పర్ల తర్వాత కూడా ఎన్ ఎంసీ ఒక్క సీటు కోత కూడా పెట్టలేదని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.
ఎన్ ఎంసీ రూల్స్ ప్రకారమే.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం గాంధీ, ఉస్మానియాలో సరైన టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నదని ప్రభుత్వం చెప్తుండగా, గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 107, జిల్లాల్లో మరో 240 వెకెన్సీలు ఉన్నట్లు డాక్టర్ల అసోసియేషన్లు చెప్తున్నాయి. దీంతోనే జిల్లాల్లో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న సుమారు 70 మందిని హైదరాబాద్ కు షిప్ట్ చేసి, ఆ తర్వాత ఇక్కడ ఏర్పడిన ఖాళీలతో పాటు అన్ని జిల్లా మెడికల్ కాలేజీల్లో(Medical Collage) వెకెన్సీలను చూపించాలని డాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. ఆ తర్వాతనే అసోసియేట్ ప్రోఫెసర్లను ప్రమోషన్లు కల్పిస్తూ పోస్టింగ్ లు ఇవ్వాలని టీచింగ్ ఆసుపత్రుల వైద్య సంఘాలూ డీఎంఈని(DME) కోరాయి. పోలీస్ విభాగంలో స్పెషల్ ట్రాన్స్ పర్లు జరిపినట్లే, అత్యవసర విభాగం కింద సీఎం పర్మిషన్ తో ప్రోఫెసరే బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వంపై ప్రెజర్ పెరిగింది. మరోవైపు గతేడాది ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కనీసం 4 సంవత్సరాలు ఒకచోట పనిచేసినవారు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌కు ఎలిజిబుల్ అవుతారు.ఈ విధంగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో 4 సంవత్సరాలకు మించి పనిచేసినవారు సుమారు 30 మంది మాత్రమే ఉన్నాట్లు డీఎంఈలోని అధికారులు చెప్తున్నారు.
Also Read: Gaddam Prasad Kumar: ఈ సంస్కృతిని ఉక్కు పాదంతో అణిచివేయాలి