Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’. పీరియడ్ యాక్షన్ జానర్లో రూపొందుతున్నందున సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదలకు సమయం సమీపిస్తుండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్మాతలు ఇప్పటికే ప్రదేశం, తేదీని కూడా ఫిక్స్ చేశారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకుందని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలగొట్టింది. సినీ విమర్శకులు సైతం ప్రశంసించేలా ట్రైలర్ ఉండటంతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read – Viral News: ట్రాఫిక్‌లో 2 గంటలు చిక్కుకున్న కంపెనీ ఓనర్.. కీలక నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా కావడంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాను చూసేందుకు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 42 నిమిషాలపాటు మొఘల్ చక్రవర్తితో వీరమల్లు చేసిన యుద్ధాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్ వేదికగా జూలై 20వ తేదీన నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని అంచనా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరింత అంచనాలు పెరగడంతో బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read – Dharmavaram Saree: ధర్మవరం పట్టు చీరకు జాతీయ గుర్తింపు.. అదిరిపోలా!
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించారు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని నిర్మాతలు తెలిపారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి తారాగణం నటించింది. ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన స్వరాలు ఇప్పటికే సంగీత ప్రియుల నోట నానుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదలవుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా అసలుసిసలైన పాన్-ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోందని మూవీ టీం తెలిపింది.