B SarojaDevi : తెలుగు సినీ పరిశ్రమలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ నటి బి. సరోజా దేవి మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ‘అభినయ సరస్వతి’గా పేరొందిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి (87) బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త భారతీయ సినీ పరిశ్రమను శోకసముద్రంలో ముంచెత్తింది. కోట మరణ వార్త మరువక ముందే ఇలా జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజా దేవి, 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసతో సినీ రంగంలో అడుగుపెట్టారు.
కాళిదాస చిత్రం ఆమెకు మొదటి విజయాన్ని అందించగా, రెండేళ్ల తర్వాత పాండురంగ మహత్యం చిత్రంతో తెలుగు తెరపై స్టార్‌డమ్ సాధించారు. ఆమె ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి దిగ్గజ నటులతో కలిసి ఆమె నటించిన చిత్రాలు దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక బంగారు యుగాన్ని సృష్టించాయి.
తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి చిత్రాల్లో ఆమె అభినయం అభిమానులను ఆకట్టుకుంది. తమిళంలో ఎంజీఆర్‌తో కలిసి నటించిన నాడోడి మన్నన్, తంగమలై రహస్యం వంటి చిత్రాలు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.