MLC Kavitha: తనపట్ల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవని, ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలుచేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి తీన్మార్ మల్లన్నపై కవిత ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని కోరారు. ప్రస్తుతం సెషన్స్ లేవు కాబట్టి, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలంటూ కవితకు ఛైర్మన్ సూచించారు. ‘‘తీన్మార్ మల్లన్న జాగ్రత్త. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడడం సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా!?. ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా!?. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుంచి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
అంశాలవారీగా మాట్లాడుకోవాలి
ఏమైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి కానీ, ఇవేం మాటలు? అంటూ మల్లన్నను కవిత నిలదీశారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా బీసీల సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని, ఏ నాడూ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదని ఆమె పేర్కొన్నారు. మరి, తనను ఆయన ఎందుకు ఆ విధంగా అన్నారో తెలియడంలేదని పేర్కొ్న్నారు.
Read Also- Tinmar Mallanna: జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్
మల్లన్న ఎవరు అసలు?
తీన్మార్ మల్లన్న ఎవరు అసలు?, నన్నెందుకు అడ్డుకుంటానని అరుస్తూ గోలగోల చేస్తున్నాడు? అని కవిత ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుంది. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుంది. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం ఉపయోగిస్తుండడంతో మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి. బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి తెలంగాణలో ఉన్నదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే మహిళలు పాలిటిక్స్‌లోకి వస్తూ ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారని ఆమె పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే రాజకీయాల్లోకి వచ్చే మహిళలు కూడా వెనుకడుగు వేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం’’ అని కవిత పేర్కొన్నారు. మల్లన్న వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని, ఎమ్మెల్సీగా మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం, డీజీపీ వరకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
Read Also- Iran Israel: ఇరాన్ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ హత్యాయత్నం.. జస్ట్ మిస్