Graduate MLC candidates
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana: ‘పట్టం’ ఎవరికో?

తెలంగాణలో మొదలైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
27న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్
ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ తప్పని త్రిముఖ పోటీ
హోరాహోరీగా తలపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
నాలుగు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న బీఆర్ఎస్
ఈ సారి గట్టి పోటీ ఇవ్వనున్న అధికార కాంగ్రెస్ పార్టీ
ఓటు హక్కు వినియోగించుకోనున్న 4.63 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లు
ప్రచారంలో దూసుకుపోతున్న తీన్ మార్ మల్లన్న
600 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు


Mlc graduate elections on may 27 telangana three parties compitition:

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి ముగిసింది. అయితే ఆ మూడు జిల్లాలలో మాత్రం ఇంకా ఎన్నికల జోష్ మిగిలే ఉంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఈ నెల 27న జరగనుంది. నామినేషన్ల విత్ డ్రా అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు 52 మంది. అయితే ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి తమ సత్తా చాటాలనీ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం విస్తరించి ఉంది. కేవలం నమోదు చేసుకున్న పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో ముందు నుంచి వ్యూహంతో తలపడుతున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. విశేషం ఏమిటంటే ఈ సారి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీచేసే అభ్యర్థులు చాలా మందే ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ ఎన్నికలలో 4.63 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరంతా ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.


12 జిల్లాల పరిధిలో..

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోని 12 జిల్లాల పరిధిలో గత ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓటర్లు నమోదు కాగా.. ఈ సారి మొత్తంగా 4,63,806 మంది ఓటర్లున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 2,87,007 మంది పురుషులు కాగా.. 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఐదుగురున్నారు. మొత్తంగా 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో 80,559 మంది, సూర్యాపేటలో 51,293, భువనగిరిలో 33,926, ఖమ్మంలో 83,606, భద్రాద్రికొత్తగూడెంలో 39,898, భూపాలపల్లిలో 12,460, ములుగు 10,237, మహబూబాబాద్ 34,759, వరంగల్ 43,594, హనుమకొండ 43,483, జనగామ 23,320, సిద్దిపేటలో 4,671 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.

తప్పని త్రిముఖ పోటీ

అయితే ఈ ఎన్నికలలో త్రిముఖ పోటీ ఖాయం అన్నది కనిపిస్తోంది. ఇప్పటిదాకా వరుసగా నాలుసార్లు ఇక్కడినుంచి గెలుపొందింది బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ కు చెందిన కపిలవాయి దిలీప్ కుమార్ రెండుసార్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. ఈ సారి కూడా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బీఆర్ఎస్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో సారి విజయం సాధించగా, 2023 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తమ సిట్టింగ్ స్థానాన్ని ఈ సారి కూడా నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది, అయితే మరో వైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్ మార్ మల్లన్న అనియాస్ చింతపండు నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. గతంలో 2021 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్ మార్ మల్లన్న ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్ గా నిలుచుని సెకండ్ ప్లేస్ లో నిలిచారు. అయితే ఈ సారి అధికార పార్టీ కాంగ్రెస్ అండతో రంగంలో దిగడంతో బీఆర్ఎస్ కు గట్టిగానే పోటీ ఇవ్వనున్నారు. మరో వైపు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరో మారు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 39,268 ఓట్లు మాత్రమే సాధించి నాలుగో స్థానంలో నిలిచిపోయారు. కానీ, ఈ సారి అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న లక్ష్యంతో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడే కావడం విశేషం.

అధికార కాంగ్రెస్ జోష్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే తీన్ మార్ మల్లన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాల వారీగా టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పట్టభద్రుల ఒపీనియన్ తీసుకుంటున్నారు. ప్రతి నిత్యం వారితో ఇంటరాక్ట్ అవుతూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన ఏనుగుల రాకేష్ రెడ్డి సైతం తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాకేష్ రెడ్డికి కొంత పట్టు ఉండగా ఎక్కువగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపైనే ఫోకస్ కేంద్రీకరించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వీరిద్దరి కన్నా ప్రచారంలో కాస్త వెనుకంజలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనైనా గెలిచి ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. బీజేపీలో కూడా అదే భావన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుండగా.. పట్టభద్రులు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?