MEPMA and SERP: మెప్మా, సెర్ప్ సంస్థలను విలీనం చేసేందుకు అడుగులు వేసింది. అందుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 23న జీవో 15ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ద్వారా కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలను ఏకీకృతం చేస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, శాఖల మధ్య సమన్వయ లోపం, ఉద్యోగుల విలీనంలో సమస్యలు, స్కీమ్‌లలో వ్యత్యాసాలు, ఇతర సాంకేతిక అడ్డంకులతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విశ్వసనీయ సమాచారం.
సెర్ప్ గ్రామీణ ప్రాంతాల్లో 47 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉండగా, మెప్మా పట్టణ ప్రాంతాల్లో 1.70 లక్షల సంఘాలు ఉన్నాయి. వాటిని ఈ రెండు సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ సంస్థలను ఏకీకృతం చేయడంతో మరింత బలోపేతం, సమర్థవంతమైన విధానాలు, ఆర్థిక వనరుల సమీకరణ, కార్యక్రమాల అమలులో ఏకరూపతను సాధించేందుకు సిద్ధమైంది. మహిళల సాధికారత, స్వయం ఉపాధి, బ్యాంకు రుణాల సులభతర, ఆర్థిక స్వావలంబన వంటి లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం (Government) భావిస్తున్నది.
Also Read: Etela Rajender: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురి మృతి!
అధికారుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
సెర్ప్ గ్రామీణాభివృద్ధి శాఖ (Department of Rural Development) పంచాయతీ రాజ్) కింద పనిచేస్తుండగా, మెప్మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (పట్టణాభివృద్ధి) పరిధిలో ఉంది. ఈ రెండు శాఖలు వేర్వేరు ఆదేశాలు, పరిపాలనా విధానాలను అనుసరిస్తున్నాయి. విలీనం కోసం రూపొందించిన ప్రణాళికలు, ఆర్థిక వనరుల విభజన, కార్యక్రమాల అమలులో అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. శాఖల్లో నిధులలో సైతం వ్యత్యాలు ఉండడంతోనూ కొంతమంది అధికారులు విలీనానికి సహకారం అందించడం లేదని సమాచారం. అంతేకాదు అధికారుల హోదాలు సైతం మారుతాయని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. సెర్ప్ సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గృహ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారిస్తుండగా, మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి, సేవా రంగం, వాణిజ్య కార్యకలాపాలపై ఆధారపడుతున్నాయి.
జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా?
మరో వైపు ఉద్యోగుల విలీనం సమస్య కీలకమైంది. సెర్ప్‌లో సుమారు 3,872, మెప్మాలో 2,000 మంది దాకా ఉద్యోగులు పని చేస్తున్నారు. పట్టణాల్లోని మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు నెలకు రూ.6 వేల వేతనం చెల్లిస్తుంటే, సెర్ప్ ఆర్‌పీలకు నెలకు రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు గ్రూపులు కలిపితే జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న అనుమానాలు సైతం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల విలీనంలో జీతాలు, పదోన్నతులు, సీనియారిటీ, పని పరిస్థితులు, బదిలీలు వంటి అంశాలపై విభేదాలు వచ్చే అవకాశం ఉందని, సీనియార్టీ సైతం పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విలీనం తర్వాత ఉద్యోగుల బదిలీలు, విధుల కేటాయింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేగాకుండా రెండు సంస్థల ఉద్యోగులకు వర్తించే సర్వీస్ నిబంధనలు, ఒప్పంద ఉద్యోగుల స్థితిగతులు, పర్మినెంట్ ఉద్యోగుల హక్కులు వంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పటికీ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియ ఎప్పటివరకు పూర్తి చేస్తుంది, రెండు శాఖలను ఎలా సమన్వయం చేస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Also Read: Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’.. టైటిలే ఇలా ఉంది.. ఇక సిరీస్ ఎలా ఉంటుందో?