Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ (Alia Bhatt) ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించి.. తెలుగు ప్రేక్షకులకు సైతం ఆమె సుపరిచితురాలు అయ్యారు. ఇదిలా ఉంటే అలియా చాలా దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. అలియా పేరు చెప్పి ఆమె మాజీ అసిస్టెంట్ ఏకంగా రూ.77 లక్షల మోసానికి తెగబడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాశ్ శెట్టి (32)ని ముంబయి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అలియా నిర్మాణసంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Eternal Sunshine Productions Private Limited)లో పనిచేస్తున్నప్పుడు వేదిక (Vedika Prakash Shetty) రూ.76.9 లక్షల మేర అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై అభియోగాలు వచ్చాయి. అలియా తల్లి, నిర్మాత సోనీ రజ్దాన్ (Soni Razdan) చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం వేదికను అదుపులోకి తీసుకున్నారు.
సంతకాలు ఫోర్జరీ
నిందితురాలు వేదికా.. 2021-24 మధ్య అలియా వ్యక్తిగత సహాయకురాలిగా పని చేసింది. ఈ క్రమంలో అలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్‌లను ఆమెనే దగ్గరుండి చూసుకునేది. అయితే ఉద్యోగంలో చేరిన ఏడాది వరకూ వేదికా బాగానే పనిచేసినప్పటికీ.. 2022 నుంచి చేతివాటం చూపించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ బిల్లులు సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఆర్థిక మోసాలకు తెగబడినట్లు పేర్కొన్నారు. అలా వచ్చిన డబ్బును తొలుత ఫ్రెండ్స్ ఖాతాలకు మళ్లించినట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత స్నేహితుల ఖాతా నుంచి తిరిగి తన వ్యక్తిగత ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకున్నట్లు గుర్తించారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయండి!
పోలీసు కస్టడీకి అప్పగింత
అయితే వేదికా ప్రకాశ్ శెట్టిపై ఎఫ్ఐర్ నమోదై చాలా రోజులు అయినప్పటికీ ఆమెను పట్టుకోవడం పోలీసులకు కాస్త కష్టంగా మారింది. వేదిక తరుచూ తన లోకేషన్స్ మారుస్తుండటంతో ఆమె ఆచూకి కనిపెట్టడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, పూణెల్లో తిరిగినట్లు పేర్కొన్నారు. ఫైనల్ గా ఆమెను బెంగళూరులో అరెస్ట్ చేసి.. ముంబయికి తరలించారు. బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు (Bandra Magistrate Court)లో ఆమెను హాజరు పర్చగా.. జులై 10వరకూ పోలీసు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. వేదిక ఒక్కరే ఈ పని చేశారా? లేదా ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.