Indiramma Houses: ఇందిరమ్మ పాలన పేదల పక్షపాతంగా ఉంటుందని, ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి విస్మరించే ప్రభుత్వం తమది కాదని, రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, మన్ననూరు గ్రామంలో ఆదివాసి చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
చెంచుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చెంచుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరా గిరి వికాస్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే ప్రారంభించారని గుర్తుచేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కష్టాలు, బాధలు తీరుస్తుందన్నారు. గతంలో ఒకప్పటి సీఎం పేదలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పి మాట తప్పారని, ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. పనికిరాని విధంగా ఉన్న తెలంగాణను కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసిన ఘనత గత ప్రభుత్వాలదేనని పొంగులేటి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, అప్పులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను కొనసాగిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్న 12 వేల చెంచు కుటుంబాలకు అదనంగా ఐటీడీఏ ద్వారా మరో 15 వేల చెంచు కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తున్న ప్రజలకు రాష్ట్రంలో రూ. 94 కోట్ల నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు. నాటి ఏపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద ఫలితమే బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కేవలం మాటలు చెప్పింది..
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో ఎన్నో మాటలు చెప్పిందని, కానీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.