Mahesh Babu: సినిమా నటులకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దీనిని క్యాష్ చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతుంటాయి. హీరోలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ముట్టజెప్పి తమ ప్రొడక్ట్స్ కు సంబంధించి వారితో యాడ్స్ చేయించుకుంటూ ఉంటాయి. అయితే ఈ యాడ్స్ సెలబ్రిటీలకు డబ్బులతో పాటు కొన్నిసార్లు సమస్యలను కూడా తెచ్చిపెడుతుంటాయి. టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో మహేష్ బాబుకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ సంస్థకు ఇచ్చిన యాడ్ నేపథ్యంలో తాజాగా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అసలేం జరిగిందంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers) పై నమోదైన కేసులో ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం (Ranga Reddy District Consumer Forum) నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. మెుదటి ప్రతివాదిగా సాయిసూర్య డెవలపర్స్ సంస్థను, రెండో ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ కుమార్ గుప్తాను చేర్చుతూ కన్జ్యూమర్ ఫోరం కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. మహేష్ బాబు యాడ్ చూసి బాలాపూర్ లో రూ.34 లక్షలు పెట్టి ప్లాట్ కొనుగోలు చేసినట్లు పిటిషనర్ అయిన వైద్యురాలు తెలిపారు. మహేశ్ ఫొటోతో బ్రోచర్ ఉండటంతో ఫ్లాట్ కు అన్ని అనుమతులు ఉన్నాయని భావించి కొనుగోలు చేశామని అన్నారు. తీరా డబ్బులు చెల్లించాక వెంచర్ కు ఎలాంటి అనుమతి లేదని తెలిసిందని వైద్యురాలు.. వినియోగదారుల ఫోరంకు తెలియజేశారు. తాము కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ హీరో మహేశ్ బాబు సహా యజమాని సతీష్ చంద్రగుప్తకు వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది.
ఆరోపణలు ఏంటీ?
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌పై రియల్ ఎస్టేట్ మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్.. హైదరాబాద్‌లో అనధికార లేఔట్లు ఏర్పాటు చేయడం, ఒకే ప్లాట్ ను పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. మెుత్తం రూ. 145 కోట్ల మోసం ఆరోపణలతో బాధితులు.. సాయి సూర్య డెవలపర్స్‌పై సైబరాబాద్ పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాలకు సంబంధించి ముమ్మర దర్యాప్తు చేస్తోంది. యజమానులతో పాటు నటుడు మహేశ్ బాబుకు 2025 ఏప్రిల్ 27, మే 12న తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది.
Also Read: Texas Floods: ఓరి దేవుడా.. అలా ఎలా బయటపడ్డారు.. రియల్లీ గ్రేట్!
మహేష్ బాబుతో లింక్
నటుడు మహేష్ బాబు.. సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ సంస్థ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం ఆయన ఫోటోలతో బ్రోచర్‌లు, ప్రకటనలు ఉపయోగించుకున్నారు. ఈ ప్రకటనలు చూసి చాలా మంది పెట్టుబడిదారులు సాయి సూర్య డెవలపర్స్‌లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రభావం వల్ల నమ్మకంగా ఫ్లాట్స్ పై పెట్టుబడి పెట్టామని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 3.4 కోట్లు నగదుగా, రూ. 2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ లావాదేవీలు మనీలాండరింగ్‌కు సంబంధించినవి కావచ్చని ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసుపై ఈడీ విచారణ చేస్తున్న క్రమంలోనే రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సైతం మహేష్ కు నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై నటుడు మహేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి.