- కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలన్న హరీశ్ రావు
- లేదంటే రైతులతో కలిసి తామే చేస్తామని హెచ్చరిక
- కుంగిన బ్యారేజీల్లో నీళ్లు ఎత్తిపోయడం ఏంటి?
- గోబెల్స్‌కు మించి ప్రచారం హరీశ్‌కు అలవాటే
- కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు
- వానాకాలం, యాసంగిలో రికార్డ్ స్థాయిలో వరి దిగుబడి
- పడి పోయే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయడం ఎందుకు?
- రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారా?
- హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
Kaleswaram: కేసీఆర్ ఏలుబడిలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో అక్కడ నీళ్లు నిల్వ చేసేందుకు వీలు లేకుండా పోయింది. గోదావరి వరద నీటిని ఆపి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని వెనక్కి ఎత్తిపోసి కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలనేది ప్లాన్. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీరు నిల్వ చేసే వీలు లేకపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యే పని కాదు. పైగా, ఎంతో ఖర్చుతో కూడుతున్నది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఇది అదనపు భారం. ప్రజల ధనం వృథా కావడం తప్ప దాని వల్ల ఉపయోగం ఉండదనేది నిపుణుల సూచన. అయితే, ఇవేమీ ఆలోచించకుండా స్వార్థ రాజకీయాలతో రైతులను తప్పుదోవ పట్టించేలా మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
హరీశ్ రావు వ్యాఖ్యలు
కన్నెపల్లి పంప్ హౌస్, కల్వకుర్తి ప్రాజెక్ట్ మోటర్లు ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే స్వయంగా కేసీఆర్ నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులతో కల్వకుర్తి, కన్నెపల్లి పంప్ హౌస్‌కు తరలి వెళ్లి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని విడిచి పెట్టమని, ప్రజాశక్తిలో ఉన్న బలం ఏంటో చూపిస్తామన్నారు. నీళ్ల విలువ తెలియని నాయకులు పాలకులుగా ఉండడం వల్ల తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉందన్నారు. రోజుకు రెండు టీఎంసీల నీళ్లను తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కౌంటర్
పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు తెర తీస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గోబెల్స్‌కు మించి అబద్ధాలు ప్రచారం చేయడం హరీశ్ రావుకు అలవాటేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తట్టుకోలేక రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టి అయోమయంలో పడేసేందుకు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, యాసంగి సీజన్‌కు ముందు కూడా బీఆర్ఎస్ ఇలాంటి అబద్ధాలు మాట్లాడిందని, రైతులను ఆందోళనకు గురి చేయాలని అప్పుడు కూడా కుటిల ప్రయత్నాలు చేసిదని వివరించారు. వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన విషయాన్ని గుర్తు చేశారు. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులకే దక్కిందన్నారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓర్వలేని గుణం బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. పదేండ్లలో తాము చేసిన తప్పులు, దుర్మార్గాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. సీకెంట్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టింది. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్ ఫైల్స్ పౌండేషన్ టెక్నాలజీతో నిర్మించడంతో ప్రమాదకరంగా మారాయి. అవి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నాయి. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కణ్నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదారిలో పోసిన విషయం మరిచిపోయారా’’ అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని, హరీశ్ రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం తమకు, రైతులకు లేదని తేల్చి చెప్పారు.
Read Also- HHVM: రిలీజ్‌కు ముందు వివాదంలో హరిహర వీరమల్లు.. టెన్షన్‌లో ఫ్యాన్స్!
మీ మాయ మాటలు ఎవరూ నమ్మరు
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు పంపాలని అన్నారు. ‘‘ఆ మూడు బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో నిర్మించారు. పైగా, ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అయినా సరే, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీశ్ రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కరకు రాకుండా నిర్మించిన తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు అబద్ధాలు వల్లించటం తప్ప, ప్రజల ప్రయోజనాలను బీఆర్ఎస్ లీడర్లు మరిచిపోయారు. కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్ట్ ఒకటో తేదీన స్విచాన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు. ఈసారి కూడా అదే విధానం అమలవుతుంది. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదు. 2019లో ఆగస్ట్ 1l, 2020లో ఆగస్ట్ 31, 2021లో ఆగస్ట్ 15న, 2022లో జులై 13న, 2023లో ఆగస్ట్ 6న కల్వకుర్తి లిఫ్ట్‌లు ఆన్ చేశారు. గత ఏడాది జులై 27న స్విచాన్ చేశారు. ఇప్పటికైనా హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలి’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.
Read Also- RK Sagar: త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’