Husband Killers: ఒకప్పుడు దేవతలుగా, శక్తి స్వరూపిణిగా పూజించబడినట్లుగా మహిళ గురించి పుస్తకాలు, సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, రాను రానూ రాజు గుర్రం గాడిద అయినట్లుగా ఈ సభ్య సమాజంలో కొందరు మహిళలు చేస్తున్న దారుణాతి దారుణాలతో స్త్రీ జాతికే కళంకం వస్తున్నది. ఇందుకు ఈ మధ్య జరిగిన కొన్ని భర్తలను భార్యలు చంపిన సంఘటనలే చక్కటి ఉదాహరణలు. ఒకరు కూల్ డ్రింక్‌లో విషం వేసి చంపితే.. ఇంకొందరు తమ ప్రియుళ్లతో కలిసి ఫ్రిడ్జ్, డ్రమ్, కుక్కర్, సూట్‌కేసులు కుక్కి చంపిన ఘటనలు మనం వార్తల్లో చూశాం. ఇవన్నీ ఒకెత్తయితే హనీమూన్‌కు తీసుకెళ్లి మరీ భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగానే బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత అనంతపురం, గద్వాల జరిగిన సంఘటనల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక చాకలి ఐలమ్మ మనువరాలు, తల్లిని ప్రియుడితో కలిసి పదో తరగతి చదివే అమ్మాయి చంపేసిందంటే అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. దీంతో ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారాలపైనే చర్చ జరుగుతున్నది. ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్‌లు అసలు పెళ్లి అవసరమా? ఎలాగో ఇప్పుడు 30 ఏళ్లు సింగిల్‌గా బతికేశాం.. మహా అంటే ఇంకో 20 లేదా 30 ఏళ్లు అంతే కదా..? పెళ్లి అయ్యి భార్య చేతిలో చావడం కంటే సింగిల్‌గానే చచ్చిపోవడం బెటర్ అని ఇలా చిత్ర విచిత్రాలుగా కామెంట్స్, వీడియోలు, మీమ్స్ చేస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ కాదు.. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? ఎలా అరికట్టొచ్చు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
బతకండి.. బతికించండి!
లవర్ ఉన్నాడు అని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? పోనీ ఒప్పుకున్నా ఆ తర్వాత అయినా కాస్త పద్ధతిగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా? పోనీ ఇవన్నీ కాదు.. కలకాలం ప్రియుడితోనే కలిసి బతకాలనుకున్నప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ విషయం ఏదో చూపులకు వచ్చిన వ్యక్తికో లేదంటే ముందుగానే తల్లిదండ్రులకు చెబితే ఓ పనై పోతుంది కదా? ఇలా చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు అవుతారు కదా?. అలా కాదని.. అవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకొని, ప్రియుడితో టచ్‌లోకి వెళ్లి చంపడం ఎంతవరకూ సమంజసం..? అణ్యం పుణ్యం ఎరుగని మగాళ్లను పొట్టన పెట్టుకోవడం ఎందుకు? ఇంట్లో చెప్పి ఒప్పించలేని.. ప్రేమ కోసం ఎదురించడానికి లేని ధైర్యం.. చంపడానికి ఎక్కడ్నుంచి వచ్చింది..? పోనీ చంపిన తర్వాత ఏమైనా ప్రియుడితో కలిసి సుఖంగా ఉంటారా అంటే అదీ లేదు కదా. కటకటాల్లోకి వెళ్లి ఊచలు లెక్కెట్టాల్సిందే కదా..! పోనీ ఇలా చేసే మహిళలకు చదువు లేదు కాబట్టి తెలియదు అనుకోవచ్చా అంటే అబ్బే అస్సలు కానే కాదు.. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కాలంలో సినిమాలు, సీరియళ్లు.. సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తే అన్నీ క్లియర్ కట్‌గా అర్థమైపోతాయి అంతే. అందుకే ఇప్పటి వరకూ జరిగిందే జరిగిందనుకొని ఇకపైన ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తొలుత కుటుంబ సభ్యులతో చర్చించడం.. లేదా ధైర్యం లేని పక్షంలో మిత్రుల ద్వారా చెప్పించడం.. ఇంకా లేదనుకుంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లతో అయినా కాస్త ఓపెన్ అయితే బహుశా వాళ్లు బతికి బట్టకడుతారు.. మీరూ ప్రశాంతంగా బతికేయొచ్చు..! పెళ్లయిన తర్వాత కూడా భార్యలకు ప్రియుడితో పెళ్లి చేసి సాగనంపిన మగవాళ్లు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోకండి.. కనీసం పెళ్లయ్యాక అయినా ఓపెన్ అవ్వండి.. ఈ విషయాలన్నీ కాస్త ఆలోచిస్తే మంచిది సుమీ..!
Read Also- Crime Awareness: అవగాహన లేని అఘాయిత్యాలు ఆపలేమా?
నాడు.. నేడు..!
వివాహేతర సంబంధాల వల్ల మానవ సంబంధాలు కాలి బూడిదైపోతున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నాడు పెద్దల కాలంలో ఉండే విలువలు.. ప్రస్తుత పరిస్థితులను కాస్త నిశితంగా పరిస్థితులు గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన వీరనారి సతీ సావిత్రి కథలను విన్న సమాజం, ఇప్పుడు జరుగుతున్న ఘటనలతో ఎటు పోతుందోనని ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తోంది. ప్రస్తుత సమాజంలో భార్యలు భర్తలను చంపడానికి వెనుకాడటం లేదని, తాత్కాలిక ఆనందాల కోసం, క్షణికావేశంలో కట్టుకున్న వారిని పాతమారుస్తున్నారు. ముఖ్యంగా.. మృత్యు గద్యాళ, అనంతపురం, మేహూలాయ హసిమున్ మర్దర్, తాజాగా బీహార్ ఘటనలు ఈ కోవకు చెందినవే. అక్రమ సంబంధాలు అనేవి సమాజంలో వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను మొత్తంగా సామాజిక విలువలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఒక సున్నితమైన, సంక్లిష్టమైన సమస్యగా మారిపోయింది. ఈ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు క్షణాల్లో బలవుతున్నాయన్నది జగమెరిగిన సత్యమే. ఇలాంటి పరిస్థితులతో పిల్లలు తీవ్రమైన మానసిక ఆవేదనకు గురవుతారు. వారి భవిష్యత్తుపై, సంబంధాలపై నమ్మకంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భద్రతా భావం కూడా కోల్పోతారు.
పట్టించుకునేదెవరు?
తల్లి కూతురు ఒక్కడితో అక్రమ సంబంధం, డబ్బులు కోసం ఎంతకైనా దిగజారుతారా? భర్త జీవితాన్ని నాశనం చేయడం ఎంత దారుణమో చూడండి. ఇలాంటి వాళ్ళ వలన స్త్రీ జాతికి కలంకం వచ్చింది. రోజు రోజుకూ భర్తలను చంపేసే పెళ్ళాల వలన సమాజం, వివాహ వ్యవస్థ పతనం చెందుతుంది. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పైన చెప్పినవన్నీ మచ్చుకు మాత్రమే. అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను చంపిన తల్లులు.. భర్తలను చంపిన భార్యలు.. తల్లిదండ్రులు చంపిన కూతుళ్లు.. ఆస్తుల కోసం అత్తమామలను లేపేసిన కూతుళ్లు.. ఇప్పుడు ఏకంగా తండ్రిని చంపిన కూతురు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాకపోతే ఎక్కడైనా ఏదైనా పురుషుడు స్త్రీని ఏమైనా చేస్తే అది పెద్ద వైరల్ అవుతుంది. కానీ, అదే విధంగా పురుషునికి జరిగితే ఎందుకు విషయం హైలెట్ కావట్లేదు? ఈ వార్తలను బట్టి స్త్రీలు అంతా ఇంతే అనడం లేదు. కానీ, ఇలాంటివి పురుషులు చేస్తే పురుషులంతా ఇంతే అని జడ్జ్ చేసే మానవతావాదులు ఇప్పుడు ఈ కన్నంలో దాకున్నారా అనేదే ప్రశ్న? హత్యలు, దోపిడీలు, మోసాలు స్త్రీ చేసిన పురుషుడు చేసిన తప్పు తప్పే. కాబట్టి జండర్ వివక్షలు మానుకోవాలని విశ్లేషకులు, నిపుణులు సూచిస్తున్నారు.
Read Also- Actress Pakeezah: తమిళనాడు ఆధార్ ఉంది.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఆదుకోండి!
సమాజం ఎటు పోతోంది?
ఇలాంటి సంఘటనలు సమాజంలో విలువలు పతనమవుతున్నాయని, సంబంధాలలో నమ్మకం, సహనం తగ్గిపోతున్నాయనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, అంచనాలు వంటివి వైవాహిక బంధాలను బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా.. సెల్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం, అశ్లీల కంటెంట్ సులువుగా అందుబాటులోకి రావడం, నైతిక విలువలు తగ్గడం వంటివి నేరాల పెరుగుదలకు కారణమవుతున్నాయని విశ్లేషణలు గట్టిగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కోర్టులపై పని భారం పెరగడం వల్ల న్యాయం ఆలస్యం అవుతుందనే భావన కూడా హింసకు దారితీయవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కుటుంబం, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు కూడా వ్యక్తిగత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఆందోళన కలిగించేదే అయితే.. సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలను హింస ద్వారా కాకుండా సామాజిక అవగాహన, చర్చల ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవడం, అలాగే సామాజిక విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాదు.. న్యాయవ్యవస్థలో మార్పులు అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Read Also- Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.. మంత్రి పొన్నం