Manjeera Barrage: నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్ లోకి కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్(Revanth) ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న జూరాల ప్రాజెక్టుకు, నేడు మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మండిపడ్డారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (SDSO) నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం క్షమించరాని నేరం అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావడం, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్ వే లోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ఏ నివేదిక గుర్తించినా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవడం మరో దుర్మార్గం అన్నారు.
దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం
నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ని రిపేర్ చేయకపోవడం, నేడు ఎస్డీఎస్ఓ నివేదిక అందినప్పటికీ మంజీరా బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టకపోవడం ఈ కాంగ్రెస్(Congress) సర్కారు అలసత్వానికే కాదు. దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. రానున్న రోజుల్లో పైనుంచి మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై చివరికి డ్యామ్‌ను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో ఇకనైనా చిల్లర రాజకీయాలు మాని అటు మేడిగడ్డ బ్యారేజీని, ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. బ్యారేజీల సామర్థ్యానికి మించిన వరద వచ్చిన సందర్బాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ గుర్తించిందన్నారు.
Also Read: Swetcha Effect: 800 ఏళ్ల చరిత్ర చెరువును కాపాడిన స్వేచ్ఛ కథనం.. స్పందించిన గ్రామస్తులు!
పగుళ్లపై నానాయాగీ చేసిన కాంగ్రెస్-బీజేపీ నేతలు
మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా ఇదే తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయని, కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ భూతద్దంలో చూపించి అటు కాంగ్రెస్(Congress), ఇటు బీజేపీ(BJP) కుమ్మక్కై బీఆర్ఎస్(BRS) పై బురదజల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పియర్స్ కు వచ్చిన పగుళ్లపై నానాయాగీ చేసిన కాంగ్రెస్-బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే, అప్పటికప్పుడు వాటిని మరమ్మత్తు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్ప కాళేశ్వరం(Kalshwaram)పై కక్షగట్టినట్టు ఏ ప్రభుత్వాలు గతంలో వ్యవహరించలేదన్నారు. పరిపాలన చేతకాక కేవలం రాజకీయ కక్షసాధింపులతో కాలం వెల్లదీస్తున్న ఈ ముఖ్యమంత్రి మంజీరా, మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే, సీఎం రేవంత్ ను, కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు.
విద్యార్థులకు అరిగోస పెడుతున్న ప్రభుత్వం
మిస్ వరల్డ్అందాల(Miss World) పోటీల్లో విందులకు ప్లేటు భోజనం రూ.లక్ష, వేములవాడలో కాంగ్రెస్ సభకు ఆలయ ఆదాయంతో ప్లేటు భోజనం రూ.36 వేలు, ఒక్కో పట్టుపంచెకు రూ.10 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసినదని కేటీఆర్(KTR) మండిపడ్డారు. పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టడం లేదన్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల(International Integrated Schools)లు అంటూ వందల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ టెండర్ వేసిదని ఆరోపించారు. ఉన్న గురుకులాలు, విశ్వవిద్యాలయాలలో భోజనం పెట్టకుండా గోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ భావి తెలంగాణ భవిష్యత్తును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నదన్నారు. నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ నేడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారి విద్యార్థులను అవస్థలు పెడుతుందని మండిపడ్డారు.
Also Read: Telangana: మత్తుపై ఉక్కుపాదం.. స్వేచ్ఛ – బిగ్ టీవీ.. మేముసైతం