మూవీ పేరు: ‘కన్నప్ప’
విడుదల తేదీ: 27 జూన్, 2025
నటీనటులు: విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, మధుబాల తదితరులు
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చావ్
ఎడిటింగ్: ఆంటోని
సంగీతం: స్టీఫెన్ దేవసి
నిర్మాత: మంచు మోహన్ బాబు
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్
Kannappa Review: మంచు ఫ్యామిలీ హీరోల నుంచి వస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో ట్రోలింగ్‌కు ఎక్కువ, సక్సెస్‌కు తక్కువ అన్నట్లుగా ఉంటున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ట్రోలింగ్‌ను ఎదుర్కొని, కాస్త విషయం ఉన్నా కూడా.. సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఫలితంగా వారి సినిమాలు భారీ పరాజయాన్ని చవిచూస్తున్నాయి. అయినా సరే, వీటన్నింటినీ లెక్క చేయకుండా, దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో, భారీ తారాగణంతో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ని పూర్తి చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం విడుదలైన పోస్టర్స్ టైమ్‌లో కాస్త నెగిటివిటీని ఎదుర్కొన్నప్పటికీ, ట్రైలర్ విడుదల తర్వాత ఒక్కసారిగా టాక్ మారింది. ఏదో విషయం ఉన్నట్టే ఉందే అనేలా పాజిటివ్ టాక్ మొదలైంది. ట్రైలర్ విడుదల తర్వాత వచ్చిన పాజిటివిటీని మంచు విష్ణు మిస్ చేసుకోకుండా, తనకు సాధ్యమైనంతగా ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యిందా? బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Kannappa Review)
కథ:
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) తన కుమారుడు తిన్నడు (మంచు విష్ణు)ను అన్నీ తానై పెంచుతాడు. విలు విద్యలో ఆరితేరిన తిన్నడు.. తన చిన్నప్పుడు జరిగిన ఓ ఘటనతో దేవుడిపై నమ్మకం కోల్పోయి, నాస్తికుడిగా మారతాడు. దేవుడు లేడని నమ్మే తిన్నడు.. తన తండ్రి మాటను మాత్రం జవదాటడు. తన గూడెంతో పాటు ఆ అడవిలో చుట్టుపక్కల ఉన్న గూడెంలలోని వారికి ఎటువంటి ఆపద వచ్చినా, వారి కోసం నిలబడి పోరాడుతుంటాడు. అలాంటి తిన్నడు ఓ మూఢ నమ్మకానికి ఎదురెళ్లి.. గూడెం నుంచి బహిష్కరించబడతాడు. అప్పటికే నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో ఉన్న తిన్నడు.. ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇద్దరూ గూడెం వదిలి వెళ్లిపోతారు. అలా వెళ్లిన తిన్నడు, దేవుడు లేడని అసహ్యించుకునే వాడు.. ఒక్కసారిగా గొప్ప శివ భక్తుడిగా మారిపోతాడు. తిన్నడులో ఆ మార్పు ఎలా వచ్చింది? అందుకు కారణమైన ‘రుద్ర’ (ప్రభాస్) ఎవరు? దేవుడు లేడన్నవాడు.. ఆ దేవుడి కోసం ఏం త్యాగం చేశాడు? తిన్నడు నుంచి కన్నప్పగా అతని పేరు ఎలా, ఎందుకు మారింది? మధ్యలో వచ్చే వాయిలింగం కథేంటి? ఈ కథకి, శ్రీకాళహస్తికి ఉన్న లింకేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.
Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
మొదటి నుంచి ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పబడుతున్నా, రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో.. ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. ‘రుద్ర’గా ప్రభాస్ కనిపించేది కొంచెం సేపే అయినా, సినిమాపై ఫుల్ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ‘రుద్ర’గా ప్రభాస్ కనబడే తీరు, పలికే డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయి. నిజంగా ప్రభాస్ ఈ సినిమాను తన భుజాలపై మోశాడని చెప్పుకోవచ్చు. అలా అని మంచు విష్ణుది ఏం లేదని అనుకోకండి. ఫస్టాఫ్‌లో తిన్నడు పాత్ర అంత ఇంట్రస్టింగ్‌గా అనిపించకపోయినా, సెకండాఫ్‌లో మాత్రం తిన్నడు మెప్పిస్తాడు. మంచు విష్ణు నటన గురించి ఫస్ట్ టైమ్ అంతా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఓ సీన్‌లో గుండెలు పిండేస్తాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్‌కు మంచి పాత్రే పడింది కానీ, ఆమెను గ్లామర్ కోసమే తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. రెండు మూడు సీన్లు ఆమెకు కూడా మంచివే పడ్డాయి. మోహన్ లాల్ కనిపించిన సీన్లన్నీ బాగుంటాయి. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించినప్పుడు సీరియల్‌లో శివుడి, పార్వతిని తలపిస్తారు. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన తన అనుభవాన్ని రంగరించి, తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. శరత్ కుమార్ పాత్ర పర్ఫెక్ట్‌గా సింకయింది. మారెమ్మగా చేసిన ఐశ్వర్య కాస్త అతిగా అనిపించింది. మధుబాల పాత్ర తేలిపోయింది. ఉన్నంతలో కౌశిక్ మంద పాత్ర పర్లేదు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన ముఖేష్ రుషి, సురేఖ వాణి, శివ బాలాజీ, బ్రహ్మానందం, సప్తగిరి, రఘు బాబు, మంచు వారి నెక్ట్స్ జనరేషన్ పిల్లలు వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. టెక్నికల్‌గా ఈ సినిమాకు ఎక్కువ మార్కులు నేపథ్య సంగీతానికి పడతాయి. స్టీఫెన్ దేవసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్సయింది. ఈ సినిమాకు ఎక్కడ, ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో, అలా ఇచ్చి తన ప్రతిభను కనబరిచాడు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా హైలైట్‌గా నడిచింది. న్యూజిలాండ్ అందాలను కెమెరా చక్కగా ఒడిసిపట్టింది. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొంత మేర ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ప్రొడక్షన్ డిజైనింగ్ ఓకే. ఎక్కువ భాగం అడవిలో ఈ సినిమా చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం ఇంకాస్త వర్క్ చేసి ఉండొచ్చు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులంతా తమ ప్రతిభను కనబరిచారు.
Also Read- Manoj Manchu: తొలిసారి ‘కన్నప్ప’ కోసం అలాంటి పోస్ట్.. మనోజ్ పై నెటిజన్ల కామెంట్ల వర్షం
విశ్లేషణ:
ఫస్టాప్ అంతా తిన్నడు పరిచయం, గూడెం నాయకులు, వాయిలింగ నేపథ్యం, నెమలితో ప్రేమ, పెళ్లి అంటూ నడిచిన ఈ సినిమా.. సెకండాఫ్‌కి వచ్చే సరికి పూర్తిగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎంటరైనప్పటి నుంచి సినిమా స్వరూపమే మారిపోయింది. ఫస్టాఫ్‌లో కథలో సంఘర్ణణను తీసుకురావడానికి చాలా టైమ్ తీసుకున్న దర్శకుడు, సెకండాఫ్‌లో మాత్రం అస్సలు బిగిసడలనీయలేదు. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ఈ సినిమాకు ప్రాణం. ప్రభాస్ పాత్రని డిజైన్ చేసిన తీరు మాత్రం అందరికీ నచ్చుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వెళ్లే వారంతా, ఫస్ట టైమ్ విష్ణు నటన గురించి మాట్లాడుకుంటారు. అంతగా ఆ సీన్లు పండాయి. ఫస్టాఫ్ తిన్నడులోని వీరుడు కనిపిస్తే, సెకండాఫ్ తిన్నడులోని భక్తుడు కనిపిస్తాడు. తిన్నడుకు, ద్వాపర యుగానికి మధ్య ఉండే సంబంధాన్ని చూపించే దృశ్యాలు, వాయిలింగం కోసం శత్రువులు ప్రయత్నించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రుద్ర, తిన్నడు మధ్య వచ్చే డైలాగ్స్ నవ్విస్తాయి, ఈలలు వేయిస్తాయి. మొత్తంగా అయితే భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా కలగాపులగం కాకుండా దర్శకుడు తెలివిగా మ్యానేజ్ చేశారు. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టినా, చివరి 40 నిమిషాల కోసమైనా ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చు.