ACB Raids: తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాలు, చెక్‌పోస్టులలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఏసీబీ అధికారులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి 12 ఆర్టీఏ కార్యాలయాలు, కొన్ని చెక్‌పోస్టులపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
అవినీతి ఆగడాలు
ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానం అమలులోకి తెచ్చినా, కొంతమంది అధికారులు ఏజెంట్లతో కుమ్మక్కై అవినీతిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, లెర్నింగ్ లైసెన్స్, ఇతర పనుల కోసం ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తున్నారని, లేకపోతే జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఏజెంట్లు తమ సర్వీస్ ఛార్జీలతో పాటు అధికారులకు ఇవ్వాల్సిన ముడుపులను ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి.
ఏసీబీ దాడులు
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ బృందాలు దాడులు జరిపాయి. మలక్‌పేట, బండ్లగూడ, టోలిచౌకి, ఉప్పల్, ఎల్బీనగర్, కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాలతో పాటు సాలూర్, నిజామాబాద్, బోరాజ్, ఆదిలాబాద్, అశ్వారావుపేట, ఖమ్మంలోని చెక్‌పోస్టులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో కార్యాలయాల గేట్లను మూసివేసి తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులను చూసి కొందరు ఏజెంట్లు గోడలు దూకి పారిపోయినట్లు సమాచారం. ఈ దాడుల్లో లెక్కల్లో లేని రూ. 2.70 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: White House: ట్రంప్ ప్రపంచాన్ని రక్షించారు.. ఆయన శాంతికాముకుడు.. వైట్ హౌస్!
ఏడుగురు ఏజెంట్లు అరెస్ట్..
ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఏడుగురు ఏజెంట్లను గుర్తించి అరెస్ట్ చేశామని, వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏజెంట్ల మొబైల్ ఫోన్లలో అధికారులతో జరిపిన చాటింగ్‌లను కూడా గుర్తించామని, సోదాలు పూర్తయిన తర్వాత అవినీతికి పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.