Sardarnagar village: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామంలో ప్రతి మంగళవారం జరిగే సంతలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తైబజార్ (సంతలో వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుము వేలం టెండర్ అగ్రిమెంట్ ఖరారు కాకముందే, కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Swetcha Effect: 800 ఏళ్ల చరిత్ర చెరువును కాపాడిన స్వేచ్ఛ కథనం.. స్పందించిన గ్రామస్తులు!
నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ..
సర్దార్‌నగర్‌లో మంగళవారం నాడు జరిగే అంగడిలో చిరు వ్యాపారులు, వాహనదారులు, పశువుల సంతకు వచ్చే రైతుల (Farmers) నుంచి నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన తైబజార్ వేలంలో ఈ ఏడాదికి రూ. 2,20,000 పలికింది. అయితే, టెండర్ దక్కించుకున్నవారు మంగళవారం ఒక్కరోజులోనే దాదాపు రూ. 80,000 వరకు వసూలు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన కేవలం మూడు మంగళవారాల్లోనే టెండర్ మొత్తం వసూలు అవుతుందని, మిగతా 8 నెలల పాటు వచ్చే ఆదాయం మొత్తాన్ని పంచాయతీ కోల్పోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేలంపై ఆరోపణలు..
వేలంలో ఎక్కువ మంది పాల్గొనకుండా చూసుకుని, తక్కువ ధరకే దక్కించుకోవడానికి లోపాయికారి ఒప్పందాలు కుదిరాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పంచాయతీకి భారీగా నష్టం వాటిల్లుతుందని, ఈ అక్రమ వసూళ్లను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామస్తుల డిమాండ్..
ప్రస్తుత తైబజార్ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలి. మళ్లీ కొత్తగా పారదర్శకంగా వేలం నిర్వహించాలి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంచాయతీ అధికారులు ఈ వివాదంపై స్పందించి, తైబజార్ వేలం ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా వేలం నిర్వహించాలని సర్దార్‌నగర్ (Sardarnagar) గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి విజయ్ సింహకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
Also Read: BJP Telangana: జూబ్లీహిల్స్‌పై బీజేపీ ఫోకస్.. సరైన అభ్యర్థి కోసం మల్లాగుల్లాలు.. ఆశలు నెరవేరేనా?
